YSRCP Rebel MLAs: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్, తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
AP High Court: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్ విచారణ పడింది. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు, తుది విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది.
AP High Court Verdict on YSRCP Rebel MLAs: అమరావతి: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్ విచారణ పడింది. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు (AP High Court), తుది విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వారి సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు (YSRCP Rebel MLAs) ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు, ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ అనర్హత విచారణ నోటీసులు రద్దు చేయాలని కోర్టును కోరారు.
రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లంచ్ మోషన్ పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. తమ వాదన వినడానికి సైతం సమయం ఇవ్వలేదని, ఉద్దేశపూర్వకంగా నోటీసులు ఇచ్చారని వారు కోర్టుకు తెలిపారు. దాంతో నోటీసులు ఇవ్వడం సహజ న్యాయసూత్రానికి విరుద్ధమని రెబల్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తరఫు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు.
స్పీకర్ తమ్మినేనిని కలిసిన రెబల్ ఎమ్మెల్యేలు
కాగా, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి సోమవారం స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిశారు. తాము ఇది వరకే లేఖలో రాసిన విధంగా 4 వారాల సమయం కోరినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం తాము కోరిన వెసులుబాటు కల్పించాలని స్పీకర్ కు విన్నవించినట్లు చెప్పారు. తాము పార్టీ నియమాలు ఉల్లంఘించినట్లు వైసీపీ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాల్సిందిగా సభాపతిని, అసెంబ్లీ కార్యదర్శిని కోరామని అన్నారు. సీఎం జగన్ ఒత్తిడి మేరకే స్పీకర్ పని చేస్తున్నారని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చినా రశీదు అడిగితే మాత్రం ఇవ్వలేదని వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ఆరోపించారు. స్పీకర్ తీరు చూస్తుంటే చట్టాలపై గౌరవం పోతోందని మండిపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కావాలనే తమపై అనర్హత వేటు వేయాలని ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలపై ఉన్న గౌరవంతోనే ఆయన్ను కలిసి సమయం కావాలని నేరుగా కోరామని, కానీ ఆయన దీనికి అంగీకరించకపోవడం వల్ల ఇప్పుడు కోర్టును ఆశ్రయించక తప్పదన్నారు. కోర్టులు, ప్రజా కోర్టుల్లోనే పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.