AP High Court: సలహాదారుల నియామకంపై ఏపీ హైకోర్టు సీరియస్-రాజ్యాంబ బద్ధమో కాదో తేలుస్తామని స్పష్టం !
AP High Court: సలహాదారుల నియామకంపై ఏపీ హైకోర్టు ఫైర్ అయింది. సీఎం, మంత్రులకు అలాగే ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమించడాన్ని ఒకేలా చూడలేమని తేల్చి చెప్పింది.
AP High Court: సలహాదారుల నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఏపీ హైకోర్టు ఫైర్ అయింది. సీఎం, మంత్రులకు, ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమించడాన్ని ఒకేలా చూడలేమని చెప్పింది. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో కలెక్టర్, పోలీసు కమిషనర్, తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమించుకునే ప్రమాదం ఉందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. సలహాదారుల నియామకానికి అసలు అంతు అనేది ఉందా అని ప్రశ్నించింది. ఈ నియామకాలు రాజ్యాంబ బద్ధమో కాదో తేలుస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలేంటో తేలుస్తామంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఎంత మంది సలహాదారులు ఉన్నారో, ప్రభుత్వ శాఖల వారీగా ఎంత మందిని నియమించారు, ఈ విషయంలో విధివిధానాలు ఏంటో పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని అడ్వకేట్ జనరల్(ఏజీ) ఎస్. శ్రీరామ్ ను ఆదేశించింది.
దేవాలయ వ్యవహారాలకు మాత్రమే పరిమితం చేయడం ఉత్తమం
పీఠాధిపతులు ఉన్నది ప్రభుత్వాలను నడపడానికి కాదని, వారు దేవాలయాల వ్యవహారాలకే పరిమితం కావడం ఉత్తమమని వెల్లడించింది. సలహాదారుల నియామకం చిన్న విషయం ఏం కాదని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం సలహాదారుగా చంద్రశేఖర్ రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన మరో పిటిషన్‌ను ప్రస్తుతం పిటిషన్ తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. శ్రీకాంత్ ను దేవాదాయ శాఖకు సలహాదారుగా నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం జీవో 630ని జారీ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ.. ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధికార ప్రతినిధి హెచ్.కె రాజశేఖర్ రావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఏనుగు దండ వేసిన వారిని రాజుగా నియమించేవారట..
శ్రీకాంత్ ఎందులో నిపుణుడో.. ఏ అర్హతలు చూసి నియమించారో జీవోలో పేర్కొనలేదని తెలిపారు. ప్రొటోకాల్ తో కూడిన సౌకర్యాలు, నెలకు రూ.1.6 లక్షల జీత భత్యాలు కల్పిస్తున్నారని చెప్పారు. గతేడాది ఆగస్టులో ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. శ్రీకాంత్ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులపై స్టే విధించింది. అయితే పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. దేవాదాయ శాఖకు సలహాదారులను నియమించేందుకు రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేదని, ఆయన నియామకానికి ఏ అర్హతలను కొలమానంగా తీసుకుందో ప్రభుత్వం చెప్పడం లేదన్నారు. పూర్వం ఏనుగు దండ వేసిన వారిని రాజుగా ప్రకటించేవారని, సలహాదారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు కూడా అలాగే ఉందని అన్నారు నచ్చినవారిని తెచ్చి నియమించుకుంటోందని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం తరపున ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ... దేవాలయాల నిర్వహణ తదితరాలపై శ్రీకాంత్ కు పూర్తి అవగాహన ఉందని, అందుకే ఆయనను సలహాదారుగా నియమించామన్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన విధుల్లో ఆయన జోక్యం ఉండదని.. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, అనుభవజ్ఞులను సలహాదారులుగా నియమించుకునే సంప్రదాయం ఉందని తెలిపారు. శ్రీకాంత్ నియాకం విషయంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను సవరించండని కోరారు. దీంతో ధర్మాసనం శ్రీకాంత్ నియామకంపై గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను సవరించింది. విచారరణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు శ్రీకాంత్ సలహాదారుగా కొనసాగే వెసులుబాటు కల్పించింది.