Anganwadi Staff Dharna: అంగన్‌వాడీ సిబ్బందిపై చర్యలు- విధులకు హాజరు కాని వారిపై వేటు
Anganwadi Staff News:అంగన్‌వాడీ సిబ్బందిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. విధులకు హాజరుకాకుండా ఉన్న వారిని టెర్మినేట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
అంగన్‌వాడీ సిబ్బందిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
డిమాండ్ల సాధన కోసం 40 రోజులకుపైగా నిరసనలు చేస్తున్న అంగన్‌వాడీ సిబ్బందిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఇప్పటికే ఎస్మాను ప్రయోగించింది. జనవరి ఐదు లోపు విధులకు హాజరుకాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. పలు మార్లు చర్చలకు కూడా పిలిచింది.
అయినా అంగన్‌వాడీలు దారికి రాకపోగా ఇప్పుడు చలో విజయవాడకు పిలుపునివ్వడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విధులకు హాజరుకాని వారి లిస్ట్‌ను పంపించాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. అలా విధులకు గైర్హాజరైన వారిని అటోమేటిక్ టెర్మినేషన్ చేయాలని సూచించారు.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అంగన్‌వాడీలు మండిపడుతున్నారు. కచ్చితంగా ప్రభుత్వాకి పోయే రోజులు దగ్గరుపడ్డాయని శాపనార్థాలు పెడుతున్నారు. గతంలో జగన్ ఇచ్చిన హామీలనే అడుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చర్చలు జరిపిన సమయంలో డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారని అంటున్నారు.
డిమాండ్ల సాధన కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని అంగన్‌వాడీ సిబ్బంది తేల్చి చెప్పారు. ఎలాంటి చర్యలు తీసుకున్నా వెనక్కి తగ్గేది లేదంటున్నారు. అంగన్‌వాడీలకు ప్రతిపక్షాల నుంచి మద్దతు లభించింది. ప్రభుత్వం దుందుడుకు చర్యలు తీసుకుంటే ఊరుకునేది లేదని చెప్పారు.