Free Bus: ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ - ఉచిత బస్సు ప్రయాణం అమలు ఎప్పటినుంచంటే?
Andhra News: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఉగాది నాటికి పథకం అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
AP Government Key Announcement On Free Bus Scheme: ఎన్నికల మేనిఫెస్టోలో మరో హామీ అమలు దిశగా కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మహిళలకు మరో గుడ్ న్యూస్ అందించనుంది. రాష్ట్రంలో ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free Bus Scheme) కల్పించే దిశగా చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు పలువురు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ ఎండీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉన్న కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తామని అధికారులు తెలిపారు. పూర్తి నివేదికను వీలైనంత త్వరగా అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉగాది నాటికి పథకం అమల్లోకి తెచ్చేలా పనులు వేగవంతం చేయాలని నిర్ధేశించారు. కాగా, ఇటీవలే ఈ పథకం అమలుపై ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. రవాణా శాఖ మంత్రి ఎం.రామ్‌ప్రసాద్‌రెడ్డి సారథ్యంలో ఏర్పాటు చేసిన కమిటీలో కన్వీనర్‌గా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, సభ్యులుగా మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు.
రోజుకు సగటున 10 లక్షల మంది..
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే భారీగా ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రోజుకు సగటున 10 లక్షల మంది వరకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పుడున్న వాటికి అదనంగా 2 వేల బస్సులతో పాటు.. 11,500 మంది సిబ్బందిని నియమించాలని చెబుతున్నారు. ఎంత రాబడి తగ్గుతుంది.?, ప్రభుత్వానికి ఎంత మేర భారమవుతుంది.?, ఏయే బస్సులకు డిమాండ్ పెరుగుతుందనే వివరాలతో ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో నిత్యం 44 లక్షల మంది ప్రయాణం సాగిస్తుండగా.. ఇందులో పాస్ హోల్డర్లు కాకుండా రోజుకు 27 లక్షల మంది టికెట్లు కొనుగోలు చేస్తారు.
బస్సుల సంఖ్య పెంచాల్సిందే..
ఈ పథకం అమలు చేస్తే ప్రస్తుతం బస్సుల్లో 68 - 69 శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ రేషియో.. 95 శాతానికి చేరుతుందని అధికారులు అంచనా వేశారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే అక్కడి ఓఆర్ 95 శాతానికి చేరింది. మొత్తం 5 రకాల సర్వీసులు కలిపి అదనంగా 2 వేల బస్సులు కావాలని అధికారులు లెక్కలు తేల్చారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పథకం అమలు కావాలంటే 5 వేల మంది డ్రైవర్లు, మరో 5 వేల మంది కండక్టర్లు, 1,500 మంది మెకానిక్‌లు ఇతర సిబ్బంది కలిపి మొత్తం 11,500 మంది ఉద్యోగులు అవసరమని అంచనా వేస్తున్నారు.
నెలకు రూ.200 కోట్లు..
ప్రస్తుతం ఆర్టీసీకి టికెట్ల ద్వారా రోజు వారీ రాబడి రూ.16 - 17 కోట్లు ఉంటోంది. ఇందులో మహిళా ప్రయాణికుల ద్వారా రూ.6 - 7 కోట్లు వస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే నెలకు సగటున రూ.200 కోట్ల రాబడిని సంస్థ కోల్పోతుంది. కాగా, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం నెలకు రూ.300 కోట్ల వరకూ జీతాలు చెల్లిస్తోంది.