Chandrababu Vizag: ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో లక్ష కోట్ల పెట్టుబడుల లక్ష్యం - ఏపీ భారీ ప్రోత్సాహకాలు -చంద్రబాబు కీలక ప్రకటనలు
Food Processing Sector: ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో లక్ష కోట్ల పెట్టుబడులకు లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పెట్టుకుంది. విశాఖలో ఇండియా ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సమ్మిట్ లో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు.

AP Food Processing Sector: ఆంధ్రప్రదేశ్‌ను ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులను ఈ రంగాల్లో సాధిస్తామని సీఎం పేర్కొన్నారు. శుక్రవారం విశాఖలో ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఇండియా ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి హాజరయ్యారు. వ్యవసాయ, అనుబంధ రంగాలను లాభదాయకంగా సుస్థిరంగా మార్చటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని సీఎం అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిశ్రమ విలువ ప్రస్తుతం 8 ట్రిలియన్ డాలర్లుగా ఉందని.. భారత్ కూడా 2030 నాటికి 700 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తోందని అన్నారు. ఈ రంగంలో భారత్ మరింత వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఫుడ్ ప్రాసెసింగ్ లో ఏపీ 9 శాతం వాటాతో 50 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉందని అన్నారు. అలాగే జీఎస్డీపీలో వ్యవసాయం సహా అనుబంధ రంగాల వాటా 35 శాతంతో రూ.5.19 లక్షల కోట్లుగా ఉందన్నారు. త్వరలోనే ఏపీ ఫ్రూట్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా అవతరిస్తుందని.. దేశంలోని ఉత్పత్తిలో 25 శాతం వాటాకు చేరుకుంటామని సీఎం తెలిపారు. అలాగే
2.26 లక్షల హెక్టార్లలో ఆక్వా కల్చర్ సాగు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆక్వా హబ్ గా ఉందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే విస్తృతమైన మౌలిక సదుపాయాలు కూడా ఏపీ సొంతమని పెట్టుబడి దారులు, ఎగుమతిదారులకు వివరించారు. రాష్ట్రంలో 9 ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులు, 17 లక్షల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్, 33 లక్షల టన్నుల సరకు నిల్వ చేసేందుకు గోదాములు ఉన్నాయని అన్నారు. ఫుడ్, బెవరేజ్ యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశాలు కల్పిస్తూ 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. చిత్తూరు, గుంటూరు, కోస్తాంధ్ర, విశాఖ జిల్లాల్లో పండ్లు, మసాలా దినుసులు, ఆక్వా, కోకో, కాఫీ క్లస్టర్లు ఉన్నాయని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, రూ.200 కోట్లకు పైగా పెట్టుబడులు దాటితే వాటిని మెగా ప్రాజెక్టులుగా పరిగణించి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని సీఎం వెల్లడించారు. గత ఏడాది రాష్ట్రానికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు.
ప్రజల ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలితో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అపారమైన అవకాశాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. పెట్టుబడులకు ఇదే సరైన సమయం అని సీఎం పిలుపునిచ్చారు. ఈ రంగంలో వచ్చే ఎంఎస్ఎంఈలను కూడా ప్రోత్సహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ సహకారం అందిస్తున్నాయని అన్నారు. వన్ ఫ్యామిలి -వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమాన్ని కూడా వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఫుడ్, బెవరేజెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలను కూడా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ సహా వ్యవసాయాధారిత పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అమరావతిలో ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చాప్టర్ ఏర్పాటు కానుండటం సంతోషదాయకమని ముఖ్యమంత్రి అన్నారు.
Addressed the India Food Manufacturing Summit 2025 in #Visakhapatnam today.#AndhraPradesh is proud to fuel India’s food processing revolution with pro-industry policies, thriving industry clusters, and robust infrastructure.
— N Chandrababu Naidu (@ncbn) August 29, 2025
With over ₹9,000 crore in new investments and a 9%… pic.twitter.com/AbG8EZwJBQ
ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సమ్మిట్ మూడో ఎడిషన్ లో ఏపీలో విలువ జోడించిన ఆహార ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్ చేసిన ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు తదితర అంశాలపై విస్తృత చర్చ జరిగింది. అలాగే ఆక్వా రంగంలో బ్రీడింగ్, నాణ్యమైన ఫీడ్, వ్యాధుల నియంత్రణ, ఎక్స్‌పోర్ట్ లింకేజిపై పారిశ్రామిక వేత్తలు, నిపుణులు, పరిశోధకులు చర్చించారు.





















