Pithapuram News : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏ అధికారిక కార్యక్రమాల్లోనూ ఒక్క వర్మ తప్ప
తెలుగు దేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎందుకు కనిపించడం లేదు. దీనికి బదులు దొరకని ప్రశ్నగా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి కనిపిస్తోంది.
మన అనే భావన ఉంటే ఎంతదూరమైనా వెళ్తాం.. తీరా అక్కడకు వెళ్లాక ఎవ్వరూ పట్టించుకోకపోతే.. కనీసం పలుకరింపునకు కూడా నోచుకోకపోతే.. అక్కడ ఇమడలేని పరిస్థితి ఎదురవుతుంది.. ఆరోజు ఏదోలా సమయం గడిపి రేపన్నాక వెళ్లేందుకు కూడా ఇష్ట పడం.. సరిగ్గా ఇలానే ఉందట పిఠాపురం నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్ల పరిస్థితి. పిలవని పేరంటానికి మనదే కదా అని వెళితే కనీస గుర్తింపు లేని చోట ఇమడలేక.. అటు బయట చెప్పుకోలేక సతమతమవుతున్నారట పిఠాపురంలోని తెలుగు తమ్ముళ్లు. నియోజకవర్గ నాయకునితో చెప్పుకుందామంటే కొన్ని సందర్భాల్లో ఆయనకే ఏమీ తెలియని పరిస్థితి ఎదుర్కొంటున్నారని, ఇక ఆయన మాకే న్యాయం చేస్తాడని లోలోన మధన పడిపోతున్నారట.. పై అధిష్టానికి చెప్పుకుందామంటూ ఇదంతా కావాలనే వర్మ చేస్తున్నారా అన్న ప్రచారంతో ముందుకు అడుగు పడక తెగ ఫీల్ అయిపోతున్నారట.
కేడర్ పరిస్థితి ఇలా ఉంటే ఇక టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ వర్మ పరిస్థితి మరో విధంగా ఉంది. ప్రాధాన్యత లేకుండా పోయిన తెలుగు తమ్ముళ్లను సంతృప్తి పరచలేక.. మరోపక్క అధిష్టానాన్ని ప్రశ్నించలేక సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారట. మొత్తంమీద పిఠాపురం కూటమిలో మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితి ఎప్పుడు లావా మాదిరి ఉప్పొంగుతుందా అనేలా పరిస్థితి ఉందని అర్ధం అవుతుంది..
అధికారిక కార్యక్రమాలకు అందని కబురు...
పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి సంకట పరిస్థితి ఎదుర్కొంటుందా అన్న ప్రశ్నకు టీడీపీ కార్యకర్తలు ఔననే సమాధానం చెబుతున్నారు. ఇక్కడ జరుగుతున్ నఏ అధికారిక కార్యక్రమాలకు తెలుగు తమ్ముళ్లకు ఏ కబురు ఉండటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురంలో ఆది నుంచి టిడిపి వర్సెస్ జనసేనగానే పరిస్థితి ఉంది. తొలినాళ్లలో వర్మకు సీటు విషయంలో అలజడి రేగిన తర్వాత చంద్రబాబు హామీతో ఆయన వెనక్కి తగ్గి పవన్‌కు మద్దతు నిలిచారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలలో పవన్ వెంటే నడుస్తోన్న వర్మ పలు సందర్భాల్లో చేదు అనుభవాల్ని ఎదుర్కొన్న పరిస్థితి కనిపించింది.
అయితే తన అసహనాన్ని ఏ మాత్రం బయటపడకుండా జాగ్రత్త పడ్డ వర్మ తన వెంట ఉండే పార్టీ నాయకులకు దక్కని గౌరవంపై మాత్రం చాలా అసంతృప్తిలో ఉన్నారన్నది ఆయన అనుచరుల మాట. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో మాత్రం ముందునుంచీ ఉన్నట్లే టిడిపి-జనసేన మధ్య ఎడమోహం పెడమోహంగానే ఉంది పరిస్థితి. మూడు పార్టీలు కలిసి చేసిన కార్యక్రమాల్లో కనీసం పట్టుమని పది మంది టీడీపీ నాయకులు లేని విధంగా పరిస్థితి మారింది. పదవుల పంపకాల్లో అధిష్టానమే అన్ని లెక్కలు చూస్తోందని సర్ధుకు పోతున్నా.. ఆఖరికి ఎవరికి ఏ పదవి వచ్చినా సర్ధుకుపోతున్నారట. ఎందుకంటే పాలన పెత్తనంలో తమకు ఎటువంటి అవకాశం ఇవ్వడం లేదన్న నిస్తేజంలో అసలు మాకు పదవుందా.. అని ప్రశ్నిస్తూ టిడిపి నేతలు బాహాటంగా విమర్శిస్తున్నారు. దీనిపై వర్మ ఎన్నిసార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో తెలుగు తమ్ముళ్లకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
అంతటా పవన్ మేనియానే..
పిఠాపురం పేరు చెబితే ప్రస్తుతం పవన్ మాటే వినిపిస్తోంది. దీంతో టిడిపిని నమ్ముకున్న వారికి కేవలం టిడిపి ప్రచార కార్యక్రమాలు తప్పితే పథకాలు, వాటి అమలకు సంబంధించి అధికారికంగా కబుర్లు రావడం లేదని టిడిపి నేతలే చెబుతున్నారు. తమ అధినాయకుడు నిత్యం టెలికాన్ఫరెన్స్ లలో కబుర్లు తప్పితే తమకు ఎటువంటి అవకాశాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో పురుషోత్తపట్నం వాటర్ పంపింగ్ ప్రారంభానికి పిఠాపురం టిడిపి ఇన్‌ఛార్జి వర్మకు ఎటువంటి కబురు రాలేదు. పిఠాపురం జైగణేష్ ఆలయ ఉత్సవాలకు సంబంధించి ఛైర్మన్ అభ్యర్థిగా ఉన్న టిడిపి సీనియర్ నేత కొరుప్రోలు శ్రీనుకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా జనసేన నేతలే సమీక్ష నిర్వహించేశారు. దీనిపై కొరుప్రోలు శ్రీను సోషల్ మీడియాలో బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అవమానంపై ఓ వీడియోను విడుదల చేశారు.
తాజాగా పాదగయలో జరిగిన సామూహిక వరలక్ష్మి వ్రతాలకు సంబంధించి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు, జనసేన నాయకులే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కానీ టిడిపి నేతలకు పిలుపు రాకపోవడంతో దీనిపైనా వారు గుర్రుగా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే జనసేన అధికారికంగా జరిపే కార్యక్రమాలకు టిడిపికి ఎటువంటి సమాచారం ఉండకపోవడంతో టిడిపిని పూర్తిగా విస్మరించారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
వర్మ మౌనం వెనుక కారణమేంటి..?
పిఠాపురం టిడిపి ఇన్‌ఛార్జిగా ఉన్న వర్మ మౌనం వెనుక కారణం ఏంటి అన్న చర్చ స్థానికంగా కొనసాగుతోంది.. పార్టీ నాయకులు, కార్యకర్తలు నిత్యం తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చినా కంగారు పడకండి అన్న సమాధానమే వినిపిస్తోందట.. అయితే అధిష్టానం కూడా వర్మ మాటను పట్టించుకోవడం మానేసిందా.. సమస్య నేరుగా డిప్యూటీ సీఎం పవన్‌ది కావడంతో టిడిపి అధిష్టానం లైట్ తీసుకుంటుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది అర్ధమైన వర్మ జనసేనతో సర్ధుకుపోయేందుకు ట్రై చేస్తున్నారన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం ప్రభుత్వ కార్యక్రమాలకు వర్మను పిలిచే విషయంలో కాస్త ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.