Andhra News: తిరుపతి తొక్కిసలాట ఘటన - న్యాయ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
Tirupati Stampede Incident: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో విచారణ జరపాలని నిర్ణయించింది.

AP Government Judicial Inquiry On Tirupati Stampede Incident: తిరుపతి తొక్కిసలాట (Tirupati Stampede) ఘటనపై ఏపీ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో జ్యుడీషియల్ విచారణ జరిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తి నివేదికను 6 నెలల్లో సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, ఈ నెల 8న తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందగా.. పలువురు భక్తులు గాయపడ్డారు. ఈ ఘటనను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా పరిగణించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం న్యాయవిచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు.
ఇదీ జరిగింది
కాగా, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం.. తిరుపతిలోని 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ దర్శనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన బైరాగిపట్టెడ వద్ద తోపులాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు, అధికారులు ఆస్పత్రిలో చేర్చారు. ఘటనా స్థలాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సమావేశం నిర్వహించి బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టారు. తిరుపతి SP సుబ్బారాయుడు, జాయింట్ కమీషనర్ గౌతమిలపై బదిలీ వేటు వేశారు. DSP రమణ కుమార్ గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరంతా తమ బాధ్యతను విస్మరించారని చంద్రబాబు మండిపడ్డారు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ ను కూడా బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని సీఎం ప్రకటించారు. తీవ్ర గాయాలైన ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని అలాగే మృతుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం, మొత్తం ఆరుగురికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసిందని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అటు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.





















