AP Government: ఏపీ సర్కారుకు ఎన్జీటీ షాక్ - వంద కోట్ల జరిమానా విధింపు
AP Government: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడినందుకు ఏపీ సర్కారుకు ఎన్జీటీ భారీ జరిమానా విధించింది. రూ.100 కోట్లు కట్టాల్సిందిగా ఆదేశించింది.
AP Government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ -ఎన్‌జీటీ భారీ జరిమానా విధించింది. చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారుకు రూ. 100 కోట్ల జరిమానా విధించింది. గుత్తా గుణశేఖర్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ పుష్ప సత్యనారాయణ, నిపుణుడు డాక్టర్ కె. సత్యగోపాల్ లతో కూడిన నేషననల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెన్నై బెంచ్ ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఆవులపల్లి, ముదివీడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్ల నిర్మాణాలను తక్షణమే నిలిపి వేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులను సైతం జాతీయ హరిత ట్రైబ్యునల్ రద్దు చేసింది.
ఒకే జీవో కింద మూడు రిజర్వాయర్లను నిర్మించి అవి తాగు నీటి అవసరాల కోసమని మొదట ఏపీ సర్కారు వాదనలు వినిపించింది. పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాతే ఎన్జీటీ ఆదేశాల ప్రకారం ఆ మూడు ప్రాజెక్టులను విడగొట్టి ఆవులపల్లి రిజర్వాయర్ కు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు తీసుకుంది. పర్యావరణ అనుమతుల దస్త్రాలలోనూ ఫ్యాబ్రికేట్ చేశారని ఎన్జీటీ పేర్కొంది. కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ కమిటీ ఏర్పాటు చేసింది. పర్యావరణ ఉల్లంఘనలపై అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర స్థాయి పర్యావరణ మదింపు సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే అంశాన్ని పరిశీలించాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ గుత్తా గుణశేఖర్ తరఫున ఎన్జీటీలో లాయర్ కె. శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. పర్యావరణ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన కంపెనీ ఫీజు చెల్లించింది. 3 ప్రాజెక్టులకు కలిపి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులను తీసుకోకుండా ఏపీ మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలోని శాఖ అనుమతులు మాత్రం ఏపీ సర్కారు తీసుకుంది. ఈ విషయంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ చెన్నై బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.