AP Govt Employees Trasfers : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, బదిలీలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!
AP Govt Employees Trasfers : ప్రభుత్వ ఉద్యోగులు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. టీచర్లు, విద్యుత్ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
AP Govt Employees Trasfers : ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పలు విభాగాల్లో బదిలీలపై మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ టీచర్ల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రైమరీ, హైస్కూల్స్ లో సబ్జెక్టు టీచర్ల నియామకం కోసం బదిలీల ప్రక్రియ చేపట్టనుంది. 3-10వ తరగతులకు 7928 సబ్జెక్టు టీచర్లను అదనంగా నియమించాల్సి ఉందని విద్యాశాఖ అంచనా వేసింది. హెడ్‌మాస్టర్ గ్రేడ్-2 సహా టీజీటీల బదిలీల ప్రక్రియను సర్కార్ చేపట్టింది. బదిలీలకు కారణంగా 2022-23 విద్యా సంవత్సరంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని పాఠశాల విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబరు 12 నుంచి జనవరి 12వ తేదీ వరకు అంటే నెల రోజుల పాటు ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. టీచర్ల బదిలీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో గ్రేడ్-2 హెడ్ మాస్టర్‌ల సర్వీసు కనీసం 5 ఏళ్లు ఉండాలని ప్రభుత్వం నిబంధనల్లో తెలిపింది. ఉపాధ్యాయుల బదిలీలకు సర్వీసుతో సంబంధం లేదని ప్రభుత్వం పేర్కొంది. బదిలీల ప్రక్రియను ఆన్‌లైన్ అప్లికేషన్, వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మున్సిపల్ టీచర్లకు నో ఛాన్స్
మున్సిపల్ టీచర్లకు ఈసారి బదిలీలలో అవకాశంలేనట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల అనంతరం బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. భార్యభర్తలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర సర్వీసు, పాఠశాల స్టేషన్ పాయింట్లు గతంలో మాదిరిగా ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. పాఠశాలల్లో సబ్జెక్టు పరంగా బోధించే టీచర్ల సంఖ్య తక్కువగా ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదులు అనుగుణంగా ప్రభుత్వం బదిలీల నిర్ణయం తీసుకుంది. దీంతో తాత్కాలికంగా సర్దుబాటు చేసేందుకు చర్యలు చేపట్టింది.
విద్యుత్ సంస్థల ఉద్యోగులకు గుడ్ న్యూస్
విద్యుత్ సంస్థల ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 17 ఏళ్ల తరువాత ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో పాటు ఏపీ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలలోని ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు బదిలీ అయ్యేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2005లో అప్పటి ప్రభుత్వం బదిలీలపై బ్యాన్ విధించడంతో ఇప్పటి వరకూ సంస్థల మధ్య బదిలీలు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో బదిలీలకు మార్గం సుగమం అయింది. ఇప్పటి వరకూ ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగి ఆ సంస్థ పరిధిలోని జిల్లాల్లోనే బదిలీ అయ్యేవారు. ఈ వెసులుబాటుతో ఆ సంస్థ ఉద్యోగి ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని జిల్లాలకు ట్రాన్ ఫర్ అయ్యేందుకు అవకాశం లభించింది. అయితే బదిలీలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏపీ ట్రాన్స్‌కో హెచ్‌ఆర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఛైర్మన్‌గా ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఈ కమిటీ నియామకంపై ఉత్తర్వులు ఇచ్చారు. డిసెంబర్ నెల 12లోపు సిబ్బంది తమ బదిలీ దరఖాస్తులను హెచ్‌ఆర్ కమిటీకి అందించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం దరఖాస్తు ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం కమిటీ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుంది. తర్వాత ప్రభుత్వం ఈ నివేదిక పరిశీలించి ఉద్యోగుల బదిలీలపై నిర్ణయం తీసుకుంటుంది.