YSRCP Leaders Cases : మళ్లీ ఆ కేసులన్నీ వచ్చేశాయ్ - వైఎస్ఆర్‌సీపీ నేతలకు షాకిచ్చిన సొంత ప్రభుత్వం !
ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసుల ఎత్తివేత జీవోలను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో వైఎస్ఆర్‌సీపీనేతలపై దాఖలైన కేసుల విచారణ కొనసాగనుంది.
YSRCP Leaders Cases : తమ పార్టీ నేతలపై నమోదైన కేసులను ఎత్తి వేస్తూ గతంలో జారీ చేసిన జీవోలను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని హైకోర్టుకు తెలిపింది. దీంతో కేసుల ఎత్తివేతపై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు మూసి వేసింది. ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులను ఇష్టానుసారం ఉపసంహరించుకుంటే కుదరదని, అది కోర్టు ధిక్కరణే అవుతుందని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తే కనుక రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉపసంహరణకు పెండింగులో ఉన్న అన్ని కేసుల్లోనూ స్టే ఇస్తామని హెచ్చరించింది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై ఉన్న మొత్తం పది కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జీవో ఇవ్వగా, దానిని సవాలు చేస్తూ ఏపీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
వైఎస్ఆర్‌సీపీ నేతలపై కేసులు ఎత్తివేస్తూ పెద్ద ఎత్తున జీవోలు విడుదల
సామినేని ఉదయభానుతోపాటు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విడదల రజిని, మల్లాది విష్ణు, గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి, జక్కంపూడి రాజా, ఎంవీ ప్రతాప్ అప్పారావు, టీటీడీ చైర్మన్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ నేతలు సీహెచ్ ద్వారకారెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డిపై కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. సీఎం జగన్‌పై ఉన్న కేసులను కూడా ఎత్తివేయడం వివాదాస్పదమయింది. అదే సమయంలో 16 సెప్టెంబరు 2020 నుంచి 25 ఆగస్టు 2021 మధ్య రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులపై ఎన్ని కేసుల ఉపసంహరణకు జీవోలు ఇచ్చారనే వివరాలను పరిశీలించేందుకు హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది.
సుమోటోగా కూడా కేసు విచారణ జరుపుతున్న ఏపీ హైకోర్టు
చెవుల కృష్ణాంజనేయులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణలో ఏపీ ప్రభుత్వం కేసుల ఎత్తివేతలకు సరైన కారణాలను వివరించలేకపోయింది. ప్రజాప్రతినిధులపై కేసులు ఎత్తివేయాలంటే హైకోర్టు అనుమతి తప్పని సరి అయినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. కేసుల ఉపసంహరణ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక ఇవ్వాలని హోంశాఖను గత విచారణలో హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు అనుమతి లేకుండా మాజీ, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల ఎత్తివేత కుదరదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు గుర్తు చేసింది.
కేసుల ఎత్తివేత జీవోల ఉపసంహరణతో పిల్ పై విచారణ ముగించిన హైకోర్టు
రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన వెంటనే.. తమ పార్టీ నేతలపై ఉన్న కేసులను ఎత్తి వేయడానికి ప్రాదాన్యం ఇస్తూ ఉంటాయి.అయితే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం పోలీస్ స్టేషన్ పై దాడులు చేసిన కేసులు, తుని అల్లర్ల కేసులను కూడా ఉపసంహరించుకుంది. అదే సమయలో పార్టీ నాయకులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నా వాటిని ఉపసంహరించుకునేందుకు జీవోలు జారీ చేసింది. ఈ కారణంగానే కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. చివరికి ఆ జీవోలన్నింటినీ వెనక్కి తీసుకోవాల్సి చ్చింది.
విశాఖ వైఎస్ఆర్సీపీలో "భూ లకటక " - రాజ్యసభ, లోక్‌సభ ఎంపీల మధ్య రాజకీయంలో నలిగిపోతున్న అధికార పార్టీ !