Andhra Pradesh Pensions : ఒకటో తేదీన 99 శాతం అవ్వాతాతలకు పెన్షన్ పంపిణీ - ఏపీ సర్కార్ మరోసారి రెడీ !
Chandrababu : ఏపీ ప్రభుత్వం సామాజిక పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసింది. ఒకటో తేదీనే అందరికీ చేరిపోవాలని పక్కా ఏర్పాట్లు చేస్తోంది. ప్రజాప్రతినిధులు కూడా పాల్గొననున్నారు.
Andhra Distribution of Social Pensions : ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పెన్షన్లను ఒకటో తేదీ ఉదయమే పంపిణీ చేయనున్నారు. ఆగస్టు నెల 1వ తేదీ ఉదయం ఆరు గంటలకే పింఛన్ పంఫిణీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సిబ్బందికి విధి విధానాలు, ముందుగాతీ సుకోవాల్సిన చర్యల గురించి ఆదేశాలు పంపించారు. పింఛన్ పంపిణీలో నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తప్పకుండా ఉంటాయని హెచ్చరికాలు జారీ చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉండే పింఛన్ లబ్దిదారులంతా కూడా ఆగస్టు ఒకటో తేదీ నాటికి స్వగ్రామంలో అందుబాటులో ఉంటే మంచిదని అధికారులు సమాచారం పంపారు.
అధికారులకు సన్నాహాక ఆదేశాలు జారీ చేసిన సెల్ప్ సీఈవో
సెర్ప్ సీఈఓ జీ వీరపాండియన్ ఉద్యోగులకు కీలక సూచనలు జారీ చేశారు. ఆగస్టు 1వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులంతా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేయాలని ఆయన జారీ చేసిన ఆదేశాల్లో తెలిపారు. మొదటి రోజే 99 శాతం పంపిణీ పూర్తి కావాలని టార్గెట్ పెట్టుకున్నామని సాంకేతిక లోపం ఏదైనా వచ్చి పింఛన్ పంపిణీ ఆలస్యమైతే తర్వాత రోజు పూర్తి చేయాలన్నారు. గ్రామ , వార్డు సచివలాయాల వారీగా పెన్షన్ నిధులు అధికారుల ఖాతాల్లో ఇప్పటికే జమ చేశారు. ఆలస్యం లేకుండా ముందు రోజునే బ్యాంకుల నుంచి తీసుకోవాలని సూచించారు.
వాలంటీర్లు లేకుండా సచివాలయ ఉద్యోగులతోనే పంపిణీ
పించన్ల పంపిణీని ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా తీసుకుంది. గతంలో వాలంటీర్లు పంపిణీ చేసేవారు. అనేక సమస్యలు వచ్చేవి. ఇప్పుడు వాలంటీర్లు లేకుండానే పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా ఎటువంటి నష్టం ఉండదు అని చెప్పడానికే మొదటి నెల పించన్లు పంపిణీ చేశామని చంద్రబాబు స్వయంగా చెప్పారు. ఎన్నికల సమయంలో సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయకుండా.. అనేక మంది వృద్ధులకు కారణమయ్యారని ఆరోపిస్తున్నారు.
ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనే అవకాశం
పింఛన్ల పంపిణీ విషయంలో కొత్త నిబంధనల ద్వారా ప్రతి లబ్దిదారు లాభపడతారు. పింఛన్ పక్కాగా అందుతుంది. అనర్హులైన లబ్దిదారులు వివరాలు బయటపడుతున్నాయి. గతంలో వైసీపీ నేతలు అర్హత లేకపోయినా పించన్లు తీసుకుని వాలంటీర్లతో కుమ్మక్కయి డబ్బులు దోచేసుకున్నారని అంటున్నారు. ఇలాంటి వారు మొదటి విడతలో కొంత మంది బయటపడ్డారు. ఈ సారి మరికొంత మంది బయటపడే అవకాశం ఉంది. మొత్తంగా ఏపీ వృద్దుల పెన్షన్లు మాత్రం ప్రతి నెలా ఒకటో తేదీన పండుగల పంపిణీ చేస్తున్నారు. ఈ సారి కూడా ప్రతినిధులు పాల్గొనాలని చంద్రబాబు సూచించారు.