edX Ap Govt : ఎడెక్స్‌తో ఏపీ ప్రభుత్వ ఒప్పందం - అందుబాటులోకి 2వేల కోర్సులు !
CM Jagan : ఎడెక్స్ అనే కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీని వల్ల పన్నెండు లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు.
Andhra News : ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత నినాదం..నాణ్యమైన విద్య అన్నది హక్కు కొత్త నినాదమని ఒప్పందం సందర్భంగా సీఎం జగన్ వ్యాఖ్యానించారు. నాణ్యమైన విద్యను అదించడంలో మనం వెనకబడితే… మిగతా వాళ్లు మనల్నిదాటి ముందుకు వెళ్లిపోతారనన్నారు. ప్రపంచంతో మనం పోటీపడుతున్నాం.. మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలి.. మంచి మంచి జీతాలు సంపాదించాలి అది.. నాణ్యమైన విద్యద్వారానే ఇది సాధ్యమని సీఎం అన్నారు. ఇప్పుడు మనం చేస్తున్నది ఒక ప్రారంభం మాత్రమే.. ఫలాలు అందడానికి కొంత సమయం పట్టొచ్చన్నారు. ఉన్నతవిద్యలో మనం వేస్తున్న అడుగులు ఫలాలు ఇవ్వాలంటే బహుశా నాలుగైదేళ్లు పట్టొచ్చునని.. కాని మనం వేసిన ప్రతి అడుగు కూడా ప్రాథమి విద్య స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ కూడా సమూలంగా మార్చుకుంటూ వస్తున్నామన్నారు.
వచ్చే పదేళ్లలో టెన్త్ విద్యా్ర్థి ఐబీ విద్యాబోధన అందించే దిశగా అడుగులు వేస్తున్నామని.. ఐబీ వాళ్లతో ఎంఓయూ చేసుకున్నామన్నారు. వచ్చే విద్యాసంవత్సరం టీచర్లకు సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టిపెట్టామని.. ఆరోతరగతి నుంచి ప్రతి తరగతి గదినీ డిజిటలైజేషన్ చేస్తున్నామన్నారు. ట్యాబ్స్ ఇచ్చి పిల్లలకు చదువులు సులభంగా అర్థమయ్యేలా చేస్తున్నామన్నారు. అత్యున్నత విద్యలో కూడాఇలాంటి అడుగులు వేయాల్సిన అవసరాన్ని భావించి… దానిపై కూడా దృష్టిపెట్టామని.. ఈ ఐదేళ్లలో కూడా హయ్యర్ ఎడ్యుకేషన్‌పై పెట్టిన ధ్యాస ఇక ముందు ఎవ్వరూకూడా పెట్టలేదన్నారు. డిజిటల్ విద్యలో భాగంగా డిగ్రీలో కూడా బైలింగువల్ పాఠ్యపుస్తకాలు.. 400కు పైగా ద్విభాషా పాడ్ క్యాస్ట్‌లు… తీసుకు వచ్చామన్నారు. రాష్ట్రంలోని 18 యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న 3,295 పోస్టుల భర్తీచేయడానికి ప్రభుత్వం ముందుకు సాగుతోందని.. తెలిపారు.
ఎడ్‌క్స్‌తో ఈరోజు చేసుకుంటున్న ఒప్పందం మరో అడుగని సీఎం జగన్ పేర్కొన్నారు. దాదాపు 2వేలకు పైగా కోర్సులు మన పాఠ్యప్రణాళికలో వర్టికల్స్ కింద మన పిల్లలకు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ఐంఐటీ, ఎల్‌ఎస్‌ఈ, హార్వర్డ్ ఇంకా ప్రఖ్యాత కాలేజీల కోర్సులుకూడా దీనిద్వారా నేర్చుకోవచ్చని.. మన దగ్గర అందుబాటులో లేని కోర్సులు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. అత్యుత్తమ యూనివర్శిటీల నుంచి సర్టిఫికెట్లు ఉండడంవల్ల ఉద్యోగం సాధనమరింత సులభతరం అవుతుందని సతృప్తి వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఎడెక్స్, ఏపీ ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధన విధానాలను రూపొందించాయి. హార్వర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనావిుక్స్, కొలంబియా, న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రపంచస్థాయి యూనివర్సిటీల నుంచి వివిధ కోర్సుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు సర్టిఫికేషన్లు సులభంగా పొందే వీలు కలగనుంది.. దీని ద్వారా మంచి వేతనాలతో కూడిన జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగాలను సాధించేలా.. విద్యార్థులను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం.. రాష్ట్రంలోని 12 లక్షల మందికి పైగా విద్యార్థులు వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు అందించే 2000 పైగా ఎడెక్స్ ఆన్లైన్ కోర్సులను, రెగ్యులర్ కోర్సులతో పాటు ఉచితంగా చదువుకునే వీలును ప్రభుత్వం కలిపిస్తోంది.. తద్వారా ఎడెక్స్, అంతర్జాతీయ యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు అందుకునే వెసులుబాటు కలుగుతుంది.
వరల్డ్ క్లాస్ వర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు అందించే 2,000+ ఎడెక్స్ ఆన్లైన్ కోర్సులను రెగ్యులర్ కోర్సులతో పాటు ఉచితంగా చదువుకుని, సర్టిఫికెట్లు పొందే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన అత్యుత్తమ అధ్యాపకులతో రాష్ట్ర విద్యార్థులకు బోధన అందించనున్నారు. హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి సహా పలు అత్యుత్తమ వర్సిటీల నుంచి ఆ కోర్సు సర్టిఫికెట్లు, క్రెడిట్లు జారీ కానున్నాయి. ఈ ఆన్‌లైన్ కోర్సులు చేయడం వల్ల రాష్ట్ర విద్యార్థులకు మంచి వేతనాలతో జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది.