Ap Pensions: పెన్షన్ డబ్బులు ఇంకా పడలేదా? - డోంట్ వర్రీ, ఇంటికే వచ్చి ఇస్తారు
Andhrapradesh News: రాష్ట్రంలో పెన్షన్ నగదు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామని.. ఇంకా జమ కాని వారికి ఈ నెల 4న నేరుగా ఇంటికే సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు.
Ap Government Distributed Pensions To Home: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వాలంటీర్లపై ఈసీ ఆంక్షల నేపథ్యంలో గత నెలలో సచివాలయాల వద్ద పెన్షన్ దారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో పొలిటికల్ హీట్ నెలకొనగా.. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శ, ప్రతి విమర్శలు అధికమయ్యాయి. అయితే, ఈ నెల నేరుగా పెన్షన్ దారుల బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం పింఛను సొమ్ము జమ చేసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా బ్యాంకులకు వృద్ధులు, పెన్షన్ దారులు పోటెత్తారు. వీరందరికీ పెన్షన్లు పంపిణీ బ్యాంకర్లకు సవాల్ గా మారింది. మే 1 నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభం కాగా.. శుక్రవారం కూడా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. అయితే, బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కాని వారికి ఈ నెల 4న (శనివారం) గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. దీనిపై ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
'సచివాలయాల్లో ఆ జాబితా'
'ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 74,399 మంది పెన్షనర్లకు బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ కానట్లు గుర్తించాం. వీరందరికీ ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందిస్తాం. బ్యాంక్ ఖాతాల్లో సొమ్ము జమ కాని వారి జాబితాను శుక్రవారం ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతాం. రాష్ట్రంలోని మొత్తం 65.49 లక్షల మందికి 63.31 లక్షల మందికి వారి ఖాతాల్లో నగదు జమ చేశాం. దాదాపు 96.67 శాతం నగదు బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యింది. డబ్బులు జమ కాని వారికి నేరుగా ఇంటికే సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తారు.' అని శశిభూషణ్ కుమార్ స్పష్టం చేశారు.
'అవే ఇబ్బందులా.?'
గత నెలలో సచివాలయాల వద్ద పెన్షన్ల కోసం లబ్ధిదారులు క్యూ కట్టడంతో ఈసారి నేరుగా బ్యాంకులో నగదు జమ చేశారు. అయితే, ఎలా చేసినా ఇబ్బందులు.. క్యూలో నిలబడడం తప్పలేదని పెన్షన్ దారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకులకు పోటెత్తడంతో రద్దీ నెలకొంది. ఈ క్రమంలో నగదు పంపిణీ బ్యాంకర్లకు సవాల్ గా మారగా.. క్యూలో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చిందని పెన్షన్ దారులు వాపోయారు. బ్యాంక్ సర్వీసుల గురించి అవగాహన లేని వృద్ధుల ఇబ్బందులు వర్ణణాతీతం. అలాగే, ఎక్కువ బ్యాంక్ ఖాతాలున్న వారు ఎందులో నగదు పడిందో తెలియక తలలు పట్టుకున్నారు. కొందరు అకౌంట్లు ఎక్కువ రోజులుగా వాడకంలో లేకపోవడంతో అవి డీయాక్టివేట్ అయ్యాయి. ఈ క్రమంలో వాటిని యాక్టివేట్ చేసుకోవాలని బ్యాంక్ అధికారులు సూచించగా.. దాని కోసం ఇబ్బందులు పడ్డారు. అసలే ఎండ తీవ్రతతో బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని చాలా మంది వాపోయారు. కొందరికి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ లేకపోవడంతో.. కేవైసీ ఇబ్బందులు తలెత్తాయి. అయితే, పెన్షన్ దారులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేసినట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఎక్కువ కౌంటర్లు పెట్టడం సహా మంచి నీళ్లను అందిస్తున్నట్లు వివరించారు. మరోవైపు, పెన్షన్ల పంపిణీ వ్యవహారం రాజకీయంగానూ హీట్ పెంచింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. పెన్షన్ దారుల కష్టాలకు టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని వైసీపీ విమర్శించగా.. దీనికి టీడీపీ కౌంటర్ ఇచ్చింది.