AP Film Chamber : రేపు డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ యాజమాన్యాల అత్యవసర సమావేశం, ఓటీటీలపై కీలక తీర్మానం!
AP Film Chamber : ఏపీ ఫిల్మ్ ఛాంబర్ లో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమాన్యాలు రేపు సమావేశం కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న థియేటర్ల యాజమాన్యాలు తదుపరి కార్యాచారణపై ఈ సమావేశంలో చర్చించనున్నాయి.
AP Film Chamber : ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో సోమవారం డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమాన్యాలు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో OTTలో విడుదలవుతున్న సినిమాలు నిలిపి వేయాలని కోరుతూ తీర్మానం చేసే అవకాశం ఉందని సమాచారం. విజయవాడ గాంధీనగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఈ సమావేశం జరుగుతుంది. ఇందులో పలు కీలక అంశాలను చర్చించేందుకు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ల యజమానులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే థియేటర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని యజమానులు వాపోతున్నారు. కరోనా నుంచి ఇంకా కోలుకోలేదని, సినీ ఇండస్ట్రీ మొత్తం థియేటర్లకు అండగా నిలబతున్నప్పటికీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పరిస్థితి అదుపు తప్పుతుందనే అభిప్రాయం యాజమాన్యాల్లో ఉంది. దీంతో భవిష్యత్ కార్యచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఏపీలో ప్రభుత్వ తీరుపై అభ్యంతరం
ఏపీలో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాలు సర్కార్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా టిక్కెట్లు అమ్మాలని నిర్ణయించటంపై యాజమాన్యాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ టిక్కెట్లను నిలువరించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నప్పటికీ దీని వెనుక ఆర్థిక పరమైన అంశాలే కీలకమని అంటున్నారు. థియేటర్ యాజమాన్యాలు చేయాల్సిన పనిని ప్రభుత్వం చేయాలనుకోవటం, ఇందుకు రెవెన్యూ అధికారులను వినియోగించటం వలన లాభం కన్నా నష్టమే అధికంగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండగా ప్రభుత్వం థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన అంశాలపై పై చేయి సాధించేందుకు ప్రయత్నించటంతో ఒక రకంగా నవ్వుల పాలయ్యింది.
కోర్టుకెక్కిన డిస్ట్రిబ్యూటర్లు
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా కేవలం సినిమా రంగంపై ఆధారపడి ఉన్న వ్యక్తులు, సంస్థలను ఇబ్బందులకు గురి చేయటంపై తీవ్రస్థాయిలో దుమారం చెలరేగింది. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోపై డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు కూడా ప్రభుత్వ చర్యలను తప్పుబట్టింది. దీంతో ప్రభుత్వం ఈ అంశంపై మరింత పట్టుదలకు పోయింది. చివరకు సినీ ఇండస్ట్రీ మెుత్తం రంగంలోకి దిగింది. మెగాస్టార్ చిరంజీవి సైతం సీఎం వద్దకు వచ్చి చర్చించారు. ఆ తరువాత మహేష్ బాబు, ప్రభాస్ తో పాటు రాజమౌళి, దిల్ రాజు దిగ్గజాలు కూడా సినీ ఇండస్ట్రీని కాపాడాలని కోరారు. ఆ తరువాత ప్రభుత్వం కమిటీని నియమించింది. దీంతో పెద్ద సినిమాలకు కాస్త ఊరట వచ్చింది. అయితే డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల పరిస్థితి మాత్రం అంతంతగానే ఉంది.
భవిష్యత్ కార్యాచరణపై చర్చ
దీంతో చాలా వరకు థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పటికీ థియేటర్లు కోలుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు 13 జిల్లాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాలు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.