Chandrababu: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 160 సీట్లు రావాలి! - టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు
AP Elections 2024: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, ఎన్నికల కోసం దిశా నిర్దేశం చేశారు.
Andhra Pradesh News: అమరావతి: వైసీపీ విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, ఏపీ పునర్నిర్మాణం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న టీడీపీ బూత్ స్థాయి కార్యకర్తలు, నాయకులతో మంగళవారం రాత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కేవలం వైఎస్ జగన్ ఓటమి కోసమే కాదు, ఏపీని గెలిపించడం కోసం 3 పార్టీలు చేతులు కలిపాయన్నారు.
ఏపీని మళ్లీ గాడిన పెట్టాలంటే కేంద్ర సహకారం కావాలి
రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విభేదాలు పక్కన పెట్టి గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 160కి పైగా సీట్లు సాధించాలన్నారు. వాడవాడలా మూడు జెండాలు కలిసి సాగాలి. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఓటు, ప్రతి సీటు ముఖ్యమేనని పేర్కొన్నారు. ఏపీని మళ్లీ గాడిన పెట్టాలంటే మనకు కేంద్ర సహకారం అవసరం అన్నారు చంద్రబాబు. ఎందుకంటే పోలవరం పూర్తి చేయాలన్నా, రాజధాని నిర్మాణానికి సైతం కేంద్రం సహకారం కావాలన్నారు. పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు, కేంద్రం మద్దతు కావాలని స్పష్టంచేశారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి న్యాయం జరిగింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
సీఎం జగన్ జనాన్ని నమ్ముకోలేదని, పోలింగ్‌లో అక్రమాలనే నమ్మారని.. కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక వైసీపీ ఆగడాలు సాగవన్నారు. పార్టీ నేతలు, అభ్యర్థులు ప్రతి కీలక అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తేవాలని టెలికాన్ఫరెన్స్‌లో వారికి సూచించారు.