Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Andhrapradesh News: కాలుష్య నియంత్రణ మండలి దస్త్రాలు దగ్ధం చేసిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Deputy CM Pawan Kalyan Serious On Documents Burnt Issue: విజయవాడలోని (Vijayawada) కృష్ణా కరకట్టపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Pollution Control Board) రికార్డుల దగ్ధం చేసిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్ధం చేసిన ఫైల్స్, రిపోర్టులకు సంబంధించిన వివరాలను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. దీని వెనుక ఎవరున్నారనే అంశాలపై ఆరా తీసిన ఆయన.. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. 'అసలు పీసీబీ కార్యాలయాల్లో ఫైల్స్, రిపోర్టులు ఏ మేరకు భద్రంగా ఉన్నాయి. భద్రపరిచేందుకు అనుసరిస్తోన్న విధానాలు ఏంటో వెల్లడించాలి.' అని అధికారులకు నిర్దేశించారు. మరోవైపు, ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. రికార్డుల దగ్ధం ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. కాగితాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్కులు, గుర్తింపు కార్డులు కూడా ఉండడంపై సీరియస్ అయ్యింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే.?
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పెదపులిపాక వద్ద నిర్మానుష్యం ప్రదేశంలో బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కారులో వచ్చిన దుండగులు కరకట్టపై బస్తాల్లోని దస్త్రాలను తగలబెట్టడం మొదలుపెట్టారు. ఈ వాహనంపై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్ ఉంది. అక్కడే ఉన్న స్థానికులు ఏం తగలబెడుతున్నారని ప్రశ్నించారు. అవి ప్రభుత్వ దస్త్రాలని గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాటిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) ఫొటోలు ఉండటంతో ఆ దస్త్రాలు తీసుకొచ్చిన కారు డ్రైవర్‌ను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అవన్నీ పొల్యుషన్ కంట్రోల్ బోర్డు(Pollution Control Board)కు సంబంధించిన దస్త్రాలని డ్రైవర్ తెలిపాడు. అటుగా వెళ్తున్న ఓ టీడీపీ కార్యకర్త దీన్ని గమనించి.. దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పీసీబీ మాజీ ఛైర్మన్ సమీర్ శర్మ చిత్రాలు ఉండడంతో వెంటనే విషయాన్ని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు.