Pawan Kalyan: 'యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం' - షర్మిలకు రక్షణ కల్పిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Andhra News: గత ఐదేళ్లలో వైసీపీ దోపిడీతో అనేక ఇబ్బందులు తలెత్తాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ఏలూరు జిల్లాలో 'దీపం 2.0' పథకాన్ని ప్రారంభించారు.
Pawan Kalyan Comments In Jagannathapuram Meeting: రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం (Free Gas Cylinder) (దీపం 2.0) కేవలం వంటింట్లో వెలుగు కోసం మాత్రమే కాదని.. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చేందుకని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఏలూరు జిల్లా (Eluru District) జగన్నాథపురం గ్రామంలో 'దీపం 2.0' పథకాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని అన్నారు. ప్రజలు తమపై భరోసాతో ఉన్నారని.. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చేలా చేసి ఎంతో బాధ్యత పెట్టారని చెప్పారు. 'గత ఐదేళ్లలో వైసీపీ విధానాల వల్ల వ్యవస్థ పాడైంది. వారి దోపిడీ వల్ల అనేక ఇబ్బందులు తలెత్తాయి. ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టినా.. కేవలం 11 సీట్లకే పరిమితం చేసినా వారి నోళ్లు ఆగడం లేదు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఏది పడితే అది మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోం. సోషల్ మీడియాలో ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టేలా పోస్టులు పెడుతున్నారు. ప్రభుత్వం ప్రతి విషయాన్నీ గమనిస్తోంది. ఆడబిడ్డల భద్రత విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా కఠిన నిర్ణయాలు తీసుకుంటాం.' అని పవన్ పేర్కొన్నారు.
'యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం'
వైసీపీ వాళ్లకు యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తామని.. గొడవ కావాలంటే అభివృద్ధికి పాటుపడే గొడవ ఇస్తామని పవన్ చెప్పారు. ఆడబిడ్డల మాన ప్రాణాలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడడమే లక్ష్యమని అన్నారు. తాము ఎవరికీ అన్యాయంగా ఎదురు తిరగలేదని.. ఆడబిడ్డల గురించి, ఇంటి ఆడపడుచుల గురించి అసభ్యంగా మాట్లాడలేదని పేర్కొన్నారు. 'గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమాన్ని అమలు చేసి చూపుతోంది. దీపం పథకం కింద ఏడాదికి రూ.2,684 కోట్లు, ఐదేళ్లకు రూ.13,425 కోట్లు ఖర్చు చేస్తుంది. 14 ఏళ్ల క్రితం ఐఎస్ జగన్నాథపురం ఆలయానికి వచ్చాను. ఇక్కడ స్వయంభుగా వెలిసిన లక్ష్మినరసింహ స్వామిని ఎప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉంచాలని కోరుకుంటున్నా. జగన్నాథపురంలో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నాం. ఇచ్చిన హామీలన్నీ పక్కాగా అమలు చేస్తాం. హామీలు అమలు కాకుంటే జనసైనికుల ప్రేమ ఎంత బలంగా ఉంటుందో కోపం కూడా అంతే బలంగా ఉంటుంది. పదవి వచ్చాక పదింతలు ఎక్కువగా కష్టపడే వ్యక్తిని.' అని అన్నారు.
అంతకు ముందు పవన్ జగన్నాథపురంలో లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో జరుగుతున్న సుదర్శన నరసింహ ధన్వంతరి గరుడాంజనేయ సుబ్రహ్మణ్య అనంత హోమంలో ఆయన పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా ఐ.ఎస్.జగన్నాథ పురం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
— JanaSena Party (@JanaSenaParty) November 1, 2024
ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ఆలయంలో జరుగుతున్న సుదర్శన నరసింహ ధన్వంతరి గరుడ ఆంజనేయ సుబ్రమణ్య అనంత హోమంలో శ్రీ పవన్… pic.twitter.com/pMLTLnuQX2
'షర్మిలకు రక్షణ కల్పిస్తాం'
జగన్ సోదరి షర్మిలకు రక్షణ కల్పిస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. 'షర్మిల.. నా ప్రాణాలకు రక్షణ కావాలి. అదనంగా సెక్యూరిటీ కల్పించాలి అని అడిగారు. అమ్మా.. మీ అన్న కల్పించలేకపోయాడేమో కానీ మీ ప్రాణాలకు కూటమి ప్రభుత్వం రక్షణగా ఉంటుంది. ఓ బాధ్యత గల నాయకురాలిగా మీరు ఎన్ని విమర్శలైనా చెయ్యొచ్చు. మీరు అప్పీల్ చేసుకోండి. సీఎం దృష్టికి తీసుకెళ్లి మీకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటాం.' అని పేర్కొన్నారు.