CPI Narayana: చింతామణి నాటకాన్ని కాదు బిగ్ బాస్ ను నిషేధించండి.... మంత్రుల బూతుపురాణాన్ని కంట్రోల్ చేయండి... సీపీఐ నారాయణ ఫైర్
చింతామణి నాటకాన్ని నిషేధించే నైతిక హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. బిగ్ బాస్ లాంటి షోలలో ఉన్న అశ్లీలత ఈ నాటకంలో లేదన్నారు.
చింతామణి నాటకాన్ని నిషేధించే నైతిక హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. వందేళ్లకు ముందు అప్పటి రాజకీయ సాంఘిక జీవనం పరిస్థితులకు అనుగుణంగా చింతామణి నాటకాన్ని రాశారని గుర్తు చేశారు. తొలుత 1923 సంవత్సరంలో రాసిన చింతామణి నాటకంలో బూతు పదాలు లేవని చెప్పారు. ఆ తర్వాత కాలక్రమంలో కొందరు నాటక ప్రదర్శనలో కొన్ని పదాలు చేర్చారని తెలిపారు. అయినప్పటికీ బిగ్ బాస్ లో కనిపించే, ప్రదర్శించే అశ్లీలత చింతామణిలో లేవన్నారు. బిగ్ బాస్ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రసారం చేయడంపై ఆయన మండిపడ్డారు. తొలుత బిగ్ బాస్ వంటి కార్యక్రమాలను నిషేదించాలని డిమాండ్ చేశారు. కొందరు నేతలు రాష్ట్రంలో కేసినోలను నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రులు సైతం బూతు పదాలను యధేచ్ఛగా మాట్లాడేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టకుండా అప్పటి సమాజంలో సాంఘిక మార్పునకు దోహదం చేసే విధంగా రచించబడి, ఇప్పటికీ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న చింతామణి నాటకాన్ని నిషేధించడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. వెంటనే చింతామణి నాటకంపై నిషేధాన్ని తొలగించాలని నారాయణ డిమాండ్ చేశారు.
Also Read: చింతామణి నాటకంపై నిషేధం... తర్వాత కన్యాశుల్కం పైనా ! సంఘ సంస్కర్తలకు లభించే విలువ అంతేనా ?
చింతామణి నాటకంపై నిషేధం
ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటకంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఎక్కడా చింతామణి నాటకాన్ని ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేసింది. తెలుగు నాట ప్రసిద్ధి చెందిన సాంఘిక నాటకం చింతామణి. 20వ దశాబ్దంలోని మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా కవి కాళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రచించారు. ఇది వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం. ఈ నాటకంపై నిషేధంతో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర వైశ్యులను అవమానించేదిగా ఉందని తక్షణం ఆ నాటకాన్ని నిషేధించాలని కొంత కాలంగా ఆర్యవైశ్య సంఘాల సమావేశాల్లో తీర్మానాలు చేస్తూ వస్తున్నారు. చింతామణి నాటకం ఇప్పటిది కాదు. 1920 ప్రాంతంలో కాళ్ళకూరి నారాయణరావు రాశారు. ఆనాటి సాంఘిక దురాచారాలను, తప్పుడు సంప్రదాయాలను సంస్కరించేందుకు ఈ నాటకాన్ని అప్పటి పరిస్థితులను బట్టి రాశారు. నాటకాలే ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్న రోజుల్లో ఈ చింతామణి నాటకానికి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడంలో తన వంతు పాత్ర పోషించింది. అలాంటి నాటకం చరిత్రలో నిలిపోయింది.
Also Read: తిరుమలకు వెళ్తున్నారా? అయితే టీకా వేసుకున్న ధ్రువపత్రం తప్పనిసరి