AP Corona Cases : ఏపీలో కరోనా కలవరం, వరుసగా ప్రజాప్రతినిధులకు పాజిటివ్
AP Corona Cases : ఏపీలో కరోనా కలవరం మొదలైంది. ప్రజాప్రతినిధులు వరుసగా కరోనా భారీన పడుతున్నారు. సీజన్ మారడంతో కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
AP Corona Cases : ఏపీలో కరోనా మరోసారి కలకలం సృష్టిస్తోంది. వరుసగా ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అధికంగా కరోనా బారినపడుతున్నారు. గతంలో కరోనా వచ్చినా మళ్లీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావటంతో ప్రజా ప్రతినిధుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. కేవలం ప్రజాప్రతినిధులు మాత్రమే కాదు వారితో ఉన్న నాయకులు, కార్యకర్తలు, వ్యక్తిగత సిబ్బందికి కూడా కరోనా లక్షణాలు ఉండటంతో వారంతా హోమ్ క్వారంటైన్ కు వెళ్లిపోతున్నారు.
పెరుగుతున్న కరోనా కేసులు
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. వాతావరణం బాగా చల్లబడింది. దీంతో కరోనా కూడా ఈజీగా వ్యాప్తి చెందుతుంది. ఎండా కాలంలో అంతగా కనిపించని కరోనా ఎండలు తగ్గి వాతావరణం చల్లబడగానే పాజిటివ్ రేట్ కూడా పెరిగిపోతోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంలో ఏపీలో కూడా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుంది. ఏపీలో కృష్ణా, గుంటూరు జిల్లాలో ప్రజా ప్రతినిధులు వరుసగా కరోనా బారినపడుతున్నారు. ఈ వ్యవహరం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
గడప గడపకు వెళ్తోన్న అధికార పక్షం
రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన నాయకులు అధికంగా కరోనా బారినపడుతున్నారు. ఇటీవల కాలంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటుగా, కొంత వరకు ఆందోళన నెలకొంది. ఇదే సమయంలో అధికార పక్షం నేతలు గడప గడపకు ప్రభుత్వం పేరుతో ప్రతి గడపను టచ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా అధికారపక్షం కార్యకర్తలు తరలి వస్తున్నారు. దీంతో కరోనా కేసులు పెరుగుతున్నాయని నాయకులు భావిస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత కూడా కరోనా బారినపడ్డారు. అంతే కాదు కృష్ణాజిల్లాలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా కరోనా బారిపడ్డారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
రాజకీయ పార్టీల్లో ఆందోళన
గడప గడపకు కార్యక్రమంలో బీజీగా ఉంటూనే రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లపై కూడా ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పర్యవేక్షిస్తున్నారు. గుంటూరు నగరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న తరువాత కొద్ది సేపటికే ఆమె కరోనా పాజిటివ్ గా రిపోర్టు రావటంతో ఆమెతో పాటు ఉన్న వారంతా హౌస్ క్వారంటైన్ కు వెళ్లాల్సి వచ్చింది. ఇక గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలా ప్రజా ప్రతినిధులు వరుసగా కరోనా బారినపడుతుండటంతో రాజకీయ పార్టీల్లో మళ్లీ ఆందోళన వ్యక్తం అవుతుంది.