YS Jagan: ఎమ్మెల్సీ ఎన్నికల డేటా విశ్లేషించిన సీఎం జగన్ - వై నాట్ 175 అని ఎమ్మెల్యేలకు సూచనలు
మారీచులతో యుద్దం చేసేందుకు రెడీ కావాలని, ఈనెల 13 నుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.
మారీచులతో యుద్దం చేసేందుకు రెడీ కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టి శాసన సభ్యులకు పిలుపునిచ్చారు. ఈనెల 13 నుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా రివ్యూ లేట్...
ఈ ఫిబ్రవరి 13న గడపగడపకూ కార్యక్రమం మీద రివ్యూ చేశామని, ఆ తరువాత మరో సమావేశానికి కాస్త గ్యాప్ వచ్చిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా గ్యాప్ వచ్చిందని ఆయన వివరించారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగటం వలన రివ్యూ కు గ్యాప్ వచ్చిందని ఆయన ఎమ్మెల్యేతో అన్నారు. ఆసరా కార్యక్రమాలు మొదలుకావటంతో గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి కాస్త గ్యాప్ వచ్చిందన్నారు.
గడప... గడప రీచ్ అవుతుంది..
మళ్లీ గడపగడపకూ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్బంగా జగన్ అన్నారు. గేర్ మార్చి రెట్టించిన స్పీడ్‌తో కార్యక్రమం చేయాలన్నారు. అందులో భాగంగానే ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని ఆయన వివరించారు. నేను చేయాల్సింది.. నేను చేయాలి.. మీరు చేయాల్సిది మీరు చేయాలని జగన్ ఎమ్మెల్యేలకు సూచించారు. బటన్ నొక్కడం ద్వారా సంక్షేమ పథకాల పంపిణీని తాను చేస్తున్నానని, శాసన సభ్యులు ఇంటింటికి తిరగటం ఆపకూడదని జగన్ అన్నారు. ఈ రెండూ సంయుక్తంగా సమర్థవంతంగా జరిగితే కచ్చితంగా 175కి 175 గెలుస్తామని జగన్ ధీమా వ్యక్తం చేశారు.
చరిత్రలో లేని విధంగా సంక్షేమం....లెక్కలు చెప్పిన జగన్
దేవుడి దయ వల్ల రాష్ట్ర చరిత్రే కాదు దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా నాలుగు సంవత్సరాలు గడవక ముందే రూ.2 లక్షల కోట్ల పైచిలుకు ఎలాంటి వివక్షకు తావులేకుండా లంచాలకు అవకాశం లేకుండా అక్క చెల్లెమ్మల కుటుంబాల అకౌంట్లో పడిందని జగన్ ఎమ్మెల్యేలకు వివరించారు. రాష్ట్రంలో అర్బన్ ప్రాంతంలో 84 శాతం, రూరల్ ప్రాంతంలో 92 శాతం కుటుంబాలు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా సగటున 87 శాతం కుటుంబాలకు మంచి చేయగలిగామని జగన్ వివరించారు. ఆ ఇళ్లల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిందని, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ జరగలేదన్నారు. 87శాతం కుటుంబాల్లో అర్హులుగా ఉన్నవారిని పారదర్శకంగా గుర్తించి పథకాలు అమలు చేయటం ప్రభుత్వ ప్రత్యేకతగా జగన్ వివరించారు. పేదవాడు మిస్ కాకుండా వెరిఫికేషన్ చేసి మరీ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేల లోపు ఉన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఉన్న కుటుంబాల్లో వారిని అర్హులుగా గుర్తించి పథకాలు ఇచ్చామని, ప్రభుత్వం రాకముందు గ్రామీణ ప్రాంతాల్లో రూ.5వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.6వేలు ఉన్న బీపీఎల్ నిర్వచనాన్ని మారుస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పరిమితిని రూ.10వేలకు, అర్బన్ ప్రాంతాల్లో రూ.12వేలకు పెంచి పథకాలు ఇచ్చిన చరిత్ర ఉందని వివరించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల డేటా చెప్పిన జగన్..
21 స్థానాల్లో ఎన్నికలు జరిగితే ,17 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి చెందిన అభ్యర్దులు విజయం సాధించారని జగన్ అన్నారు. అయితే ఇప్పుడు మనం మారీచులతో యుద్ధం చేస్తున్నామని, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారని చెప్పారు. వాస్తవాలు అందరికీ తెలియాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం జరుగుతున్న అపోహలకు దుష్ప్రచారాలకు సంబంధించి కొన్ని వాస్తవాలు తెలుసుకోండంటూ జగన్ డీటెయిల్ గా వివరాలను శాసన సభ్యులకు వివరించారు. ఒక్క ఎమ్మెల్సీ స్థానం 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి ఉందని, ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఓటర్లు ఉంటారని తెలిపారు.
ఎమ్మెల్సీ స్థానం.. దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి ఉంటుందని, ఆ పరిధిలో 87 శాతం అక్క చెల్లెమ్మల కుటుంబాలు, మన కుటుంబాలు ఉన్నాయి. నేరుగా బటన్ నొక్కుతున్నాం. వారికి మంచి జరుగుతుందని చెప్పారు. అలాంటి 80 లక్షల కుటుంబాల్లో, కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదు చేసుకున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో మనం 87 శాతం ఎవరికైతే చేశామో వారు ఎమ్మెల్సీ ఓటర్లలో చాలా తక్కువగా ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లలో దాదాపుగా ఈ రెండున్నర లక్షల మంది ఓటర్లలో దాదాపు 80 శాతం మంది డీబీటీలో లేనివారు ఉన్నారని వివరించారు.. కేవలం 20శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నారని, ఇది ఏరకంగా రిప్రజెంటేటివ్ శాంపిల్ అవుతుందని జగన్ ప్రశ్నించారు.
ఒకటో ప్రాధాన్యం.. రెండో ప్రాధాన్యం, మూడో ప్రాధాన్యాలు ఉన్నాయని, మిగిలిన పార్టీలంతా కలిసి పని చేస్తే, మనం మాత్రమే సింగల్ గా పోటీలో నిలిచామని అన్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి ప్రాధాన్యతతో గెలవలేదని, రెండో ప్రాధాన్య ఓటు బదిలీ కావడం వల్ల, ఇంత మంది ఏకం కావడం వల్ల, రెండో ప్రాధాన్యత ఓటు తో గెలవటం, ఏ రకంగానూ ఎఫెక్ట్ కాదని చెప్పారు. వాపును చూపించి.. అది బలం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రొజెక్టు చేసుకుంటున్నారంటూ జగన్ మండిపడ్డారు.
వదంతులు ప్రచారం చేస్తారు జాగ్రత్త...
రాబోయే రోజుల్లో ఇంకా పుకార్లు ప్రచారం చేస్తారని జాగ్రత్తగా ఉండాలని జగన్ వైసీపీ శాసన సభ్యులను అలర్ట్ చేశారు. 50– 60 మందికి టిక్కెట్లు ఇవ్వటం లేదని, లిస్టు కూడా తయారు చేస్తున్నారని చెప్తారని, ఆ జాబితాలో ఇంత మంది వెళ్లిపోతున్నారంటూ ఇదే పనిగా పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని జగన్ అన్నారు. పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యేపైనా ప్రచారం చేస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి మరీ విష ప్రచారం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ ప్రచారాలు ఇంకా ఎక్కువ ఉంటాయని, వాటిని తిప్పికొట్టాలని జగన్ అన్నారు.
జగనన్నే మన భవిష్యత్ పై...
జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమం ఏప్రిల్ 7 న ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు. ఏప్రిల్ 20 వరకు జరుగుతుందని, సచివాలయ కన్వీనర్, గృహసారధులను ఏకం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని జగన్ పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో ఉన్న వ్యవస్ధను ఒక్కటి చేస్తున్నామని, వీళ్లని ప్రతి ఇంటికి పంపించే కార్యక్రమం పక్కాగా జరగాలన్నారు.
అదే స్పీడ్ లో జగనన్నకు చెబుదాం...
ఈనెల 13న జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై జగన్ క్లారిటీ ఇచ్చారు. వ్యక్తిగత సమస్యలను పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం ఉంటుందని జగన్ చెప్పారు. రేషన్ కార్డు స్ప్లిట్ కాకపోవడం వంటి సమస్యలు, గ్రామంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు, పరిష్కరించడానికి జగనన్నకు చెబుదాం, కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.ఈ నెల 13న ఈ కార్యక్రమం చేపడుతున్నాం. నేరుగా ఎవరికి సమస్య ఉన్నా నేరుగా తనకే ఫోన్ చేయవచ్చుని, వాటిని కూడా పరిష్కరిస్తామని జగన్ అన్నారు.