Andhra Pradesh: దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
Andhra Pradesh: కర్నూలు సీటు ఇవ్వలేకపోయానని, కానీ రెండేళ్ల తర్వాత జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు హఫీజ్ ఖాన్‌ను అభ్యర్థిగా ప్రకటించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్
YS Jagan announces Rajya Sabha seat for Hafeez Khan - ఎమ్మిగనూరు: తాను మాట ఇచ్చానంటే నిలబెట్టుకునే వ్యక్తినని చెప్పే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. పార్టీ కోసం ఎంతగానో శ్రమించిన హఫీజ్ ఖాన్‌ను రాజ్యసభకు పంపిస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఎమ్మిగనూరులో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ (Memantha Siddham Sabha) సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కర్నూల్ నుంచి హఫీజ్ ఖాన్‌కు తాను టికెట్ ఇవ్వలేకపోయానని, 2 ఏళ్ల తరువాత వచ్చే రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థిగా తాజాగా ప్రకటించారు. తన మనసులో ఎలాంటి కల్మషం ఉండదని, అందుకే లక్షల మంది సమక్షంలో ముస్లిం నేత హఫీజ్ ఖాన్‌ను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించానన్నారు. చంద్రబాబుకు, తనకు మధ్య ఉన్న తేడా ఇదేనన్నారు.
మా ప్రభుత్వానికి రాఖీ కట్టండి..
‘పేదలకు సొంతింటి కల నెరవేర్చాం. ప్రతి నెలా ఒకటో తేదీనే రూ.3 వేల పెన్షన్ ఇస్తున్నాం. ఈ అయిదేళ్ల పాలనలో పేదల ఖాతాల్లో రూ.2 లక్షల 70 వేల కోట్లు జమ చేశాం. చంద్రబాబు హయాంలో ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగలేదు. ఒక్కసారి కూడా వారి ఖాతాలో రూపాయి సైతం జమ చేయలేదు. ఈ ప్రభుత్వం మీకు మంచి చేసిందని భావిస్తే అక్కాచెల్లెమ్మలు రాఖీ కట్టి ఆశీర్వదించాలని’ ఏపీ సీఎం జగన్ కోరారు.
విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దని చంద్రబాబు అడ్డు పడుతుంటే వైసీపీ పాలనలో పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించామన్నారు. పేద విద్యార్థులకు చదువుదూరం చేసిన వారికి, బీసీలు, ఎస్సీలను మోసం చేసిన వారికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. మేం ఒంటరిగా పోటీ చేస్తుంటే, చంద్రబాబు తన కుమారుడ్ని కాకుండా దత్తపుత్రుడ్ని.. ఢిల్లీ నుంచి మోదీని తెచ్చుకుని గెలిచేందుకు కుట్రలు చేస్తున్నాడంటూ సీఎం జగన్ మండిపడ్డారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అని చెప్పి చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏదీ నెరవేర్చలేదు. మళ్లీ సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.
బీసీలు, ఎస్సీలకే 80 శాతం ఉద్యోగాలు
‘కేవలం 58 నెలల్లోనే 2 లక్షల 31 వేల ఉద్యోగాలు మేం ఇచ్చాం. ఇందులో బీసీలు, ఎస్సీలకే 80 శాతం ఉద్యోగాలు ఇచ్చాం. రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. కాగా, రైతన్నలకు అండగా నిలిచింది వైసీపీ ప్రభుత్వం. గతంలో చంద్రబాబు, పవన్, మోదీలు ఏపీ ప్రజలను మోసం చేయగా.. మరోసారి ఆ ముగ్గురు కలిసి రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, వర్గాల వారికి సంక్షేమ పథకాలు ఇచ్చాం. జగన్ పాలనతో మీకు ప్రయోజనం కలిగింది, మీ జీవితాల్లో మార్పు వచ్చింది అనుకుంటే వైసీపీకి ఓటు వేయండి. తమ గుర్తు ఫ్యాన్ అని, మరోసారి సంక్షేమ పార్టీకి భారీ విజయం అందించాలని’ ఏపీ ప్రజలను సీఎం జగన్ కోరారు.