(Source: ECI/ABP News/ABP Majha)
YSR Housing Scheme: అక్టోబర్ నుంచి జగనన్న కాలనీలు.. పేదలందరికీ ఇళ్ల పథకంపై సీఎం జగన్ రివ్యూ... టిడ్కో ఇళ్లపైనా కీలక నిర్ణయం
పేదలందరికీ ఇళ్లు, టిడ్కో ఇళ్లపై ఏపీ సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 2021 నాటికి లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు అందిస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.
పేదలందరికీ ఇల్లు, ఇంటి స్థలాల పంపిణీపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. జగనన్న కాలనీలు, మౌలిక వసతులపై ఈ సమావేశంలో సమీక్షించారు. మంత్రులు ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథరాజు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం
నిర్మాణ సామాగ్రిలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విద్యుదీకరణకు అవసరమైన సామాగ్రి కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇళ్లు కట్టి ఇచ్చే పనులు అక్టోబర్ 25వ తేదీ నుంచి ప్రారంభించాలని ఆదేశించారు. జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉండాలని సూచించారు. 90 రోజుల్లోగా అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలన్నారు.
డిసెంబర్ 2021కి
టిడ్కో ఇళ్లపైనా సీఎం జగన్ సమీక్షించారు. ఫేజ్–1లో భాగంగా 85,888 ఇళ్ల పనులు పూర్తి చేశామని అధికారులు సీఎంకు తెలిపారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. డిసెంబర్ 2021 నాటికల్లా ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు.
విజయదశమి నాటికి
పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకే ప్లాట్లు పథకంపై సీఎం జగన్ సమీక్షించారు. దాదాపు 3.94 లక్షల ప్లాట్లకు డిమాండ్ ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. 150, 200, 250 గజాల విస్తీర్ణంలో ప్లాట్ల ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. విజయదశమి నాటికి కార్యాచరణ సిద్ధం చేసి, అమలకు తేదీలు ప్రకటించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ప్రకాశం పంతులకు నివాళులు
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనమని సీఎం జగన్ కొనియాడారు. సోమవారం టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి క్యాంప్ కార్యాలయంలో నివాళులర్పించారు. ‘‘తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి’’ అని ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు.
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి క్యాంప్ కార్యాలయంలో పూలుజల్లి నివాళులర్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్. pic.twitter.com/iVHXOZIK7k
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 23, 2021
Also Read: Fact check: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలపై కేంద్రం ఒప్పందం... ఫేక్ మేసేజ్ పై పీఐబీ క్లారిటీ