Jagan, Chandrababu Delhi Tour: ఒకేరోజు ఢిల్లీకి జగన్, చంద్రబాబు - ఆసక్తికరంగా మారిన ఆ మీటింగ్!
పరస్ఫర ప్రత్యర్థులైన ఇద్దరు నేతలు ఒకే రోజు ఢిల్లీకి వెళ్లడం.. ఒకే సమావేశానికి హాజరు కావడంతో ఈ పర్యటన ఆసక్తికరంగా మారింది.
CM Jagan, Chandrababu Delhi Tour: సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒకే రోజు ఢిల్లీ వెళుతున్నారు. డిసెంబరు 5న రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశానికి వారు హాజరుకానున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఇద్దరూ పాల్గొనబోతున్నారు. ఉన్నపళంగా ఇద్దరూ ఒకే సమావేశం కోసం ఢిల్లీకి వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది. అయితే నిజానికి.. భారత్ జీ - 20 (G 20 Summit) దేశాల కూటమికి అధ్యక్షత వహిస్తోంది. డిసెంబర్ 1వ తేదీ 2022 నుంచి 2023 నవంబర్ 30వ తేదీ వరకు జీ - 20 (G 20 Summit) దేశాల కూటమికి అధ్యక్షత వహించనుంది. రాష్ట్రపతి భవన్‌లో 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు సంబంధించి రాజకీయ పార్టీల అధ్యక్షుల సలహాలు తీసుకునేందుకు కేంద్రం ఈ సమావేశం నిర్వహిస్తోంది.
అందుకే అన్ని పార్టీలకు ఆహ్వానం అందించింది. అంతేకాదు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశానికి కూడా కేంద్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాజకీయ పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులకు ఆహ్వానం పంపింది. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్‌తో పాటు చంద్రబాబుకు కూడా ఇన్విటేషన్ పంపించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో డిసెంబర్ 5వ తేదీన హస్తినకు వెళ్లనున్నారు ఇరువురు నేతలు. దీంతో సీఎం జగన్, ఇటు చంద్రబాబు ఇద్దరూ మోదీ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరవుతున్నారు.
పరస్ఫర ప్రత్యర్థులైన ఇద్దరు నేతలు (CM Jagan, Chandrababu) ఒకే రోజు ఢిల్లీకి వెళ్లడం.. ఒకే సమావేశానికి హాజరు కావడంతో ఈ పర్యటన ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఏడాది కాలంలో వివిధ ప్రాంతాల్లో 32 రంగాలపై కేంద్రం 200 లకి పైగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించే జీ - 20 సమావేశ (G 20 Summit Agenda) ఎజెండా కోసం అఖిలపక్ష భేటీలో అభిప్రాయాలు తీసుకోనుంది. కూటమికి నాయకత్వం వహించాల్సిన, భారత్ తీసుకోవాల్సిన బాధ్యత పైన చర్చించి.. పార్టీల అధినేతల నుంచి సలహాలు స్వీకరించే క్రమంలో భాగంగా ఆ సమావేశం ఏర్పాటు చేశారు. ఇక సమావేశంలో సీఎం జగన్, చంద్రబాబు ఎదురుపడితే పలకరింపులేమైనా ఉంటాయా? లేదంటే నమస్కారాలు, ప్రతి నమస్కారాలైనా ఉంటాయా? అసలు వీరు ఎదురుపడతారా? అనేది చూడాలి.
గత ఆగస్టు 15న ఒకే కార్యక్రమానికి ఇద్దరూ, కానీ..
గత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించేలాగానే ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (AP Governor Biswabhusan Harichandan) ఎట్ హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు హాజరయ్యారు. వీరు వేర్వేరుగా కార్యక్రమానికి హాజరైనా ఎదురుపడతారేమోనని తొలుత అందరూ భావించారు. కానీ, ముందుగా చంద్రబాబు హాజరై గవర్నర్ దంపతులను కలిసి వెళ్లిపోయారు. చంద్రబాబు వెళ్లిపోయాక సీఎం జగన్ ఎట్ హోం కార్యక్రమానికి వచ్చారు.