AP Telangana News: మీటింగ్ పెట్టండి, ఆరోజు మీ దగ్గరికే వచ్చి కలుస్తా - రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ
Telugu Latest News: ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఇరు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు ఈ చొరవ చూపారు.

Chandrababu Letter to Revanth Reddy: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాక ఏర్పడ్డ విభజన సమస్యలను పరిష్కరించుకోవడం కోసం లేఖ రాసినట్లు చంద్రబాబు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనం కోసం విభజన సమస్యల పరిష్కారం దిశగా సమావేశం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు. తద్వారా విభజన సమస్యలపై చర్చించుకుందామని.. పొరుగు రాష్ట్రాలుగా పరస్పర సహకారాలు అందించుకుందామని చంద్రబాబు తెలిపారు.
‘‘తనదైన ముద్ర వేస్తూ పరిపాలన సాగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు. మీ చిత్తశుద్ధి, నాయకత్వ పటిమ తెలంగాణ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి.
తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న మనం రెండు రాష్ట్రాల సమగ్ర, సుస్థిర అభివృద్ధి కోసం పరస్ఫరం సహకారం అందించుకోవాలి. ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు గడిచాయి. పునర్విభజన చట్టం ప్రకారం ఇంకా ఎన్నో సమస్యలు పరిష్కారం కావాల్సి ఉండగా అవన్నీ ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయాయి. వాటి కారణంగా మన రెండు రాష్ట్రాల్లో సంక్షేమం, ఇతర అంశాలకు అడ్డంకిగా మారుతోంది. వీటన్నింటిని మనం కూర్చొని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం జూలై 6న శనివారం మధ్యాహ్నం మీ ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసుకొందామని నేను ప్రతిపాదిస్తున్నాను.
రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కీలకమైన సమస్యలు ఇలా ముఖాముఖి సమావేశంలో కూర్చొని చర్చించుకుంటేనే పరిష్కారం అవుతాయి. ఇరు రాష్ట్రాలకు లబ్ధికలిగే విధంగా పరస్పరం సహకరించుకోవాలి. మన భేటీ సత్ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నాను’’ అని చంద్రబాబు లేఖలో రాశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

