AP Caravan Tourism: ఏపీలోని 15 ప్రాంతాల్లో కారవాన్ టూరిజం - అక్టోబర్ నుంచి ప్రారంభించే అవకాశం
AP Caravan Tourism: విదేశాల్లో బాగా పాపులరైన కారవాన్ టూరిజాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తేబోతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 టూరిజం ప్రాంతాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకు వస్తోంది.
AP Caravan Tourism: ఏపీలోని అందమైన పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వస్తున్న పర్యాటకుల కోసం ఏపీ పర్యాటక శాఖ కారవాన్ టూరిజంను అందుబాటులోకి తేబోతుంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అంజోడ (అరకులోయ సమీపంలోని అటవీ మరియు ఉద్యానవనం), దల్లాపల్లి (పాడేరు సమీపంలోని హిల్ స్టేషన్), భీమిలి (బీచ్ ప్రాంతం) సహా 15 ప్రదేశాలలో కారవాన్ టూరిజంను ప్రవేశ పెట్టబోతుంది. ఇటీవలే కేరళలో ఈ కారవాన్ టూరిజాన్ని ప్రారంభించారు. ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో కారవాన్ లోనే వంట చేసుకొని, అందులోనే రాత్రి బస చేసే అవకాశం ఉంటుంది. అలాగే ట్రాన్స్ పోర్ట్స, వ్యూ పాయింట్ వద్దే స్టే వంటి సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఈ వాహనంలో ఓ పడక గది, వంటగది, మంచినీటి నిల్వ ఉంటుంది. వాహనంలో ఆడియో, వీడియో సౌకర్యం వంటివి కూడా ఉంటాయి. ఏపీలో ప్రధాన పర్యాటక ప్రాంతాలైన విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, గండికో తదితర 15 చోట్ల దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతున్నారు.
“మేము వైజాగ్ ప్రాంతంలో మూడు ప్రదేశాలలో కారవాన్ టూరిజంను ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకున్నాము. ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు అటవీ శాఖ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం. అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబరులో కారవాన్ టూరిజం ప్రవేశపెడతాం’’ - ఏపీటీడీసీ ప్రాంతీయ సంచాలకులు పాణి శ్రీనివాస
అరకు, లంబసింగి, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో కారవాన్ ను పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభించాలని రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు చూస్తున్నారు. ఫఐన్ చెట్లు అధికంగా ఉన్న అనంతగిరికి 35 కిలో మీటర్ల దూరంలోని అంజోడాలో ఫారెస్ట్ కారవాన్, డల్లాపల్లిలో హిల్ స్టేషన్ కారవాన్, ఎర్రమట్టి దిబ్బలు ఎదురుగా బీచ్ కారవాన్ ను పైలట్ గా ప్రారంభించేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పైలట్ ప్రైజెక్టు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఎంపిక చేసిన కన్సల్టెన్సీ సన్నాహాలు ప్రారంభిచింది. లగ్జరీ వాహనాలు కాకుండా, సాధారణ వాహనాలను లగ్జరీగా డిజైన్ చేయబోతున్నారు.