School Funds BJP Vs YSRCP : నాడు-నేడు పథకం సొమ్ము కేంద్రానిది.. సోకు జగన్ ప్రభుత్వానిది ! వైఎస్ఆర్‌సీపీపై ఏపీ బీజేపీ విమర్శలు !
నాడు - నేడు పథకం నిధులు కేంద్రం ఇచ్చిందని పార్లమెంట్‌లో కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానంతో ఏపీ బీజేపీ నేతలకు మరో అస్త్రం దొరికింది. కేంద్ర నిధులతో పనులు చేసి వైసీపీ రంగులు వేసుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
School Funds BJP Vs YSRCP : ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ లో నాడు - నేడు పథకం కింద చేపట్టిన పనులను ఏపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. అయితే బీజేపీ కేంద్ర నిధులతో చేసిన పనులని చెబుతోంది. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి ఇచ్చిన సమాచారం ఆధారంగా బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పథకం కేంద్రానిది , ప్రచారం వైకాపా ప్రభుత్వానిదన్నారు.
పాఠశాలలో " నాడు -నేడు" అసలురూపం.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) December 22, 2022
పథకం కేంద్రానిది , ప్రచారం వైకాపా ప్రభుత్వానిది !
కేంద్ర సమగ్ర శిక్షా పథకం కింద 2022-23లో #AndhraPradesh లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన, భవనాలు మరమ్మతుల కోసం 867 కోట్ల రూపాయలు ఇఇచ్చాము. అన్నపూర్ణ దేవి పార్లమెంట్‌లో వెల్లడించారు. pic.twitter.com/FfpACUBtwW
అసలు కేంద్రం ఏం చెప్పిందంటే ?
సమగ్ర శిక్షా పథకం కింద 2022-23లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన, భవనాలు మరమ్మతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రూ. 867 కోట్లు విడుదల చేసినట్లు విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు.కేంద్రం విడుదల చేసిన నిధులలో ఈ ఏడాది డిసెంబర్ 15 నాటికి 823 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు నేడు పేరుతో వినూత్న పథకాన్ని రూపొందించిందని చెప్పారు. సమగ్ర శిక్షా పథకం కింద వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం చేపడుతున్న అత్యుత్తమ చర్యలు, వినూత్న విధానాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుకరించేందుకు వీలుగా పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు “షాగన్ డిజిటల్ రెపోసిటొరీ” వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి
సమగ్ర శిక్షా పథకం కింద యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎడ్యుకేషన్ డేటా బేస్ ద్వారా లోపాలను గుర్తించి నిర్ణయించిన విధంగా, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి స్వీకరించిన వినతుల ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, భవనాల మరమ్మతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని మంత్రి తెలిపారు. అవసరాలు, ప్రాధాన్యతల ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతి ఏటా కసరత్తు చేస్తాయని, అవి ఆయా రాష్ట్రాల వార్షిక కార్యాచరణ ప్రణాళికలోను, బడ్జెట్‌లోను ప్రతిబింబిస్తాయని మంత్రి వివరించారు.
ఏపీలో నాడు - నేడు మొదటి విడత కింద ఎంత ఖర్చు చేశారంటే ?
ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2019 నవంబర్ 14న ‘నాడు-నేడు’ పథకాన్ని ప్రారంభించింది. మూడేళ్ల వ్యవధిలో దశల వారీగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటి విడత కోసం సుమారు రూ.3,700 కోట్లు ఖర్చు చేశారు. అందులో గత ఏడాది ఒక్క ఏడాదిలోనే రూ. 867 కోట్లు విడుదల చేసినట్లు గా కేంద్రం చెప్పింది. ఇది బీజేపీ నేతలకు అస్త్రంగా మారింది. కేంద్ర పథకాలతో చెప్పిన పనులు.. వైఎస్ఆర్‌సీపీ రంగులు వేసుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.