AP BJP : గణేష్ మండపాలకు అనుమతులు తీసుకోవద్దు - ఏపీ బీజేపీ పిలుపు ! ఎందుకంటే ?
గణేష్ మండపాలకు అనుమతులు తీసుకోవద్దని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏపీ ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP BJP : ఏపీ ప్రభుత్వం వినాయక చవితికి కూడా పెద్ద ఎత్తున ఆంక్షలు పెడుతోందని.. డబ్బులు వసూలు చేస్తోందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజలు ఎవరూ మండపాలకు అనుమతులు తీసుకోవద్దని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం హిందువుల పవిత్ర పండగకు రాష్ట్ర ప్రభుత్వం , అధికారులు ఎందుకు ఇలా నిబంధనలు పెడతారని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రం లో వినాయక చవితికి అనుమతులు ఎవ్వరూ తీసుకోవద్దు .#GaneshUtsav4Andhara #AndhraPradesh pic.twitter.com/I2SZylBdZq
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) August 27, 2022
ఈ అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికే సీఎం జగన్‌కు లేఖ రాశారు. దశాబ్దాల తరబడి ఆనవాయితీగా చలువపందిళ్లు ఏర్పాటు చేసి వినాయక నవరాత్రులు నిర్వహించే ఉత్సవ కమిటీలకు ప్రభుత్వం నిబంధనలు పేరుతో పోలీసులు ఉత్సవ కమిటీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. హిందువుల తొలిపండుగ అయిన వినాయక చవితి ఉత్సవాలను రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుపుకునే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఉండాలని అంటున్నారు. గత సంవత్సరం కోవిడ్ నిబంధనల పేరుతో వినాయక చవితి ఉత్సవాలను తగ్గించే విధంగా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను నిరసిస్తూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన ఉద్యమం చేసిదని నేతలు గుర్తు చేస్తున్నారు. అదే విధంగా ఈ సారి కూడా ఎవరూ అనుమతులు తీసుకోవద్దని కోరుతున్నారు.
వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో పల్లెల్లో, పట్టణ, నగరాల్లోని అన్ని కూడళ్లలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి హిందూ ధర్మ ఆచారం అన్నారు సోము వీర్రాజు. కానీ ఇందుకు విరుద్ధంగా ఈ ఏడాది వినాయక చవితి వేడుకల్లో డీజే సౌండ్ సిస్టంగానీ, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు గాని జరపటానికి వీలు లేకుండా, అఫిడవిట్లు ఇవ్వాలని, నిర్వాహకులు సంతకాలతో ముందస్తు హామీ పత్రం తప్పనిసరి చేయడం, విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలని ఇతర నిబంధనల పేరుతో పోలీసులు ఒత్తిడి చేస్తున్నారన్నారు. దీనిని బీజేపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వినాయక చవితి ఉత్సవాలను జరపాలంటేనే హిందువులు భయపడేలాగా నిబంధనలు విధించడం ఏమాత్రం సరికాదన్నారు. ఇలాంటి చర్యల ద్వారా ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదన్నారు.
గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రజలకు కావలసిన సేవలను అందిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాలకు మాత్రమే నిబంధనల పేరుతో ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ నిర్వాహకులు తిప్పడం ఏరకంగా సమంజసమా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. అందువల్ల వెంటనే ఈ అంశంలో తగిన ఆదేశాలు జారీ చేయాలని వినాయక చవితి ఉత్సవాలు స్వేచ్ఛాయుత వాతావరణంలో చేసుకునే అవకాశాన్ని కల్పించాలని లేకపోతే.. తాము ఉద్యమిస్తామన్నారు. అనుమతులు తీసుకోకుండా వేసే పందిళ్లకు ఎవరైనా ఆటంకాలు కల్పిస్తే.. తాము అండగా ఉంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు.