AP Assembly Session: సినిమా కళాకారులను వైసీపీ ఎమ్మెల్యేలు అవమానించారు- అందుకే అలా రియాక్ట్ అయ్యాను: బాలకృష్ణ
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నందమూరి బాలకృష్ణ, మంత్రి అంబటి రాంబాబు మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడిచాయి.
AP Assembly Session: అసెంబ్లీలో జరిగిన ఘటనలు తలుచుకుంటే బాధేస్తోందని, నియంతృత్వ ధోరణిలో శాసనసభను నడిపిస్తున్నారని హిందూపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. ప్రజల్లో చంద్రబాబు ఎంతో ఆత్మవిశ్వాసం నింపారని, ఆధారాలు లేని కేసులో జైలుకు పంపారని బాలయ్య వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదని పేర్కొన్నారు. తెలుగు సినిమా కళాకారులను వైసీపీ ఎమ్మెల్యేలు ఘోరంగా అవమానించారని చెప్పారు. సినీ రంగం నుంచే ఎన్టీఆర్ అసెంబ్లీకి వెళ్లి ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారని గుర్తు చేశారు. సభలో నాకొక్కడికే అవమానం జరగలేదని, మొత్తం తెలుగు సినీ పరిశ్రమను కించపరిచారని అన్నారు. అసెంబ్లీలో మీసం మెలేసి, తొడకొట్టింది వైసీపీ ఎమ్మెల్యేలే అని బాలకృష్ణ పేర్కొన్నారు. నేను చేయని పనిని చేసినట్లు అసత్యాలు సృష్టించారని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు మందబలంతో విర్రవీగుతున్నారు మండిపడ్డారు. ప్రజలే వారికి త్వరలో బుద్ది చెప్తారు అన్నారు. నా వృత్తిని అంబటి రాంబాబు అవమానించాడని, నా వృత్తి నాకు అమ్మ లాంటిదని పేర్కొన్నారు. అంబటికి కౌంటర్ గా తొడకొట్టి, మీసం మెలితిప్పినట్లు తెలిపారు. ఎవరికీ భయపడనని, భయపడాల్సిన అవసరం లేదని బాలకృష్ణ అన్నారు. తిడితే అందరిలా పడి ఉంటానని అంబటి అనుకున్నాడని.. రియాక్ట్ అయ్యేసరికి వాళ్లు బిత్తర పోయారని నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చారు.
ఈ రోజు అసెంబ్లీకి ఒక దుర్దినం: అచ్చెన్నాయుడు
ఈ రోజు అసెంబ్లీకి ఒక దుర్దినంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభివర్ణించారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అన్నారు. బాలకృష్ణకు స్పీకర్ వార్నింగ్‍ను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. స్పీకర్ తీరు చాలా దారుణంగా ఉందని అచ్చెన్నాయుడు తెలిపారు.
టీడీఎల్పీ దగ్గర బుచ్చయ్యచౌదరి, పేర్నినాని మధ్య వాడీవేడి చర్చ నడిచింది. ప్రతిపక్షం హింసను కోరుకుంటోందన్నారు పేర్ని నాని. సభలో జరిగిన పరిణామాలను లాబీలో వివరించారు. బుచ్చయ్య మనసు చంపుకొని రాజకీయం కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. దీనికి రియాక్ట్ అయిన బుచ్చయ్యచౌదరి రాజకీయం కోసం కాదు, రాజ్యాంగం కోసం పనిచేస్తున్నానని అన్నారు.
అసెంబ్లీ లాబీల్లో పయ్యావుల కేశవ్ చిట్‍చాట్ లో ఆసక్తికరమైన సంభాషణ సాగింది. సభలో వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని కానీ తాము వాళ్ల ట్రాప్‍లో పడలేదన్నారు. సభలో హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టార్గెట్ చేసేలా వైసీపీ సభ్యులు వ్యవహరించారన్నారు.
వాడివేడిగా మొదటిరోజు సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు వాడివేడిగా ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే చంద్రబాబు అరెస్టుపై టీడీపీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇచ్చారు. బాబు అరెస్టుపై వెంటనే చర్చ జరపాలంటూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని, కేసులు ఎత్తివేయాలని ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల తీరుపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుపైనా, స్కిల్ డెవలప్‌మెంట్ పైనా సరైన ఫార్మాట్ లో చర్చకు సిద్ధమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటించారు. బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అసెంబ్లీలో ఏ అంశమైనా చర్చకు సిద్ధమని, చంద్రబాబు అరెస్టు పై కూడా ఎంత సమయమైనా ఇస్తామని చెప్పారు. టీడీపీ సభ్యులు ఇక్కడ బల్లలు కొట్టడం కాదని, దమ్ముంటే కోర్టులో బల్లలు కొట్టాలని బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. ఇక్కడ అరవడం కాదని, వెళ్లి కోర్టులో వారి వాదనలను వినిపించాలన్నారు.
టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలపడంపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. బుగ్గనా చెప్పినా టీడీపీ సభ్యులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు.. టీడీపీ నేతలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. చంద్రబాబు అరెస్టుపై చర్చకు సిద్దమని, కాసేపు ఓపిక పడితే చర్చిద్దామని వెల్లడించారు.
ఈ క్రమంలోనే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంత్రి అంబటి రాంబాబు వైపు చూస్తూ.. తొడగొట్టి, మీసం మెలేశారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు కావాలనే రెచ్చగొడుతున్నారని అన్నారు. టీడీపీ సభ్యులు అవాంఛనీయ ఘటనలను ఆహ్వానిస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో మీసాలు తిప్పడం కాదని, సినిమాల్లో మీసాలు తిప్పుకోవాలని మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే రా అంటూ అంబటి సవాల్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తొడగొట్టి బాలకృష్ణకు సవాల్ విసిరారు. బయటకు రా చూసుకుందామని అన్నారు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా.. సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అనంతరం స్పీకర్ అసెంబ్లీని వాయిదా వేశారు.