Breaking News Live: కిన్నెర మొగిలయ్యకు రూ.కోటి నజరానా ప్రకటించిన సీఎం కేసీఆర్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
ప్రముఖ చిత్రకారుడు, రచయిత దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి కన్నుమూశారు. సుబ్బరాయశాస్త్రి గురువారం రాత్రి తమిళనాడు రాజధాని చెన్నైలో తుదిశ్వాస విడిచారని సమాచారం. అద్భుతమైన కార్టూన్లు, కథలతో చిన్నారులతో పాటు పెద్దలను సైతం అలరించిన సుబ్బరాయశాస్త్రి కలం పేరు బుజ్జాయి. కార్టూనిస్టుగా, చిన్న పిల్లల కథా రచయితగా ఆయన చాలా ఫేమస్. ముఖ్యంగా ఆయన క్రియేట్ చేసిన డుంబు పాత్ర సుబ్బరాయశాస్త్రికి చాలా పేరు తెచ్చింది.
ప్రముఖ కవి, సినీ గేయరచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాజహంస దంపతులకు సెప్టెంబరు 11 1931 లో దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి జన్మించారు. మిగతావారిలా స్కూలుకు వెళ్లకపోయినా ఆయన తనకంటూ ఓ ప్రత్యేక పేరును సంపాదించుకున్నారు. చిన్నతనంలో తండ్రి కృష్ణశాస్త్రి వెన్నంటే ఉండేవారు. దాంతో ఆ కాలం నాటి గొప్ప వ్యక్తులందరికి సన్నిహితంగా మెలిగే అవకాశం కలగడంతో ఎన్నో విషయాలు నేర్చుకునేవారు. ప్రముఖ కవి, రచయిత శ్రీశ్రీ ఓ సభలో బోరు కొడుతుందని సుబ్బరాయశాస్త్రిని షికారుకు తీసుకెళ్లి ఆడించారు. ఇలా ప్రముఖులతో చిన్ననాటి నుంచి కొత్త విషయాలు, జీవితాన్ని నేర్చుకున్నారు. వాటిని బొమ్మల రూపంలో, చిన్న పిల్లల కథల రూపంలో మన ముందుకు తీసుకొచ్చి విజయం సాధించిన వారిలో ఈయన ఒకరు.
దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి 17 ఏళ్ల వయసులో బుజ్జాయి ‘బానిస పిల్ల’ అనే బొమ్మల పుస్తకం ప్రచురించి 'కామిక్ స్ట్రిప్' పుస్తకాలకు దేశంలోనే ఆద్యుడిగా పేరుపొందారు. బాపు రమణల బుడుగు లాంటి క్యారెక్టర్ డుంబు సృష్టికర్తగా నిలిచారు. చిన్నారులు ఎంతగానో ఇష్టపడే పంచతంత్ర కథలకు ఎంతో అందమైన బొమ్మలు వేసి ఇలస్ట్రేటెడ్ వీక్లీలో 1963 నుంచి 68 వరకూ సీరియల్ గా ప్రచురించారు. ఈ ఇంగ్లీష్ కామిక్స్ 5 పుస్తకాలుగా వచ్చాయి. మిత్రలాభం, మిత్రభేదం పుస్తకాలుగా ఇవి తెలుగులోనూ అందుబాటులో ఉన్నాయి. ఆయన భైరవ్, పెత్తందార్, డుంబు కామిక్ స్ట్రిప్పులను చేశారు.
దేవులపల్లి సుబ్బరాయశాస్త్రికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. తన కుమారునికి తండ్రి పేరు దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి పేరు పెట్టారు. సుబ్బరాయశాస్త్రి కుమారుడు కూడా రచయిత. ఓ కుమార్తె రేఖా సుప్రియ, బుజ్జాయి రెండవ కుమార్తె లలిత రామ్ కూడా రచయిత్రి అయ్యారు.
గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం కథానికను బొమ్మలద్వారా పాఠకులకు పరిచయం చేశారు. ‘న్యాయానికి భయం లేదు’ అనే బొమ్మల ధారావాహిక 1975లో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైంది. ప్రముఖులతో తాను నేర్చుకున్న విషయాలు, అనుభవాలను ‘నాన్న-నేను’ అనే స్వీయచరిత్ర పుస్తకాన్ని రాశారు. ‘నవ్వులబండి - డుంబు బొమ్మల కథలు’ అనే పుస్తకాన్నిరాసి చిన్నారులకు వినోదాన్ని పంచారు.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా నేడు భారీగా తగ్గింది. తులానికి ఏకంగా రూ.400 తగ్గింది. వెండి ధర కిలోకు రూ.800 తగ్గుదల కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,500 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,640 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.800 తగ్గి రూ.67,700గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,640గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.67,700 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,500 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,640గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,700గా ఉంది.
కిన్నెర మొగిలయ్యకు రూ.కోటి నజరానా ప్రకటించిన సీఎం కేసీఆర్
తెలంగాణ జానపద కళాకారుడు కిన్నెర మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించారు. రూ. కోటి నజరానా ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే హైదరాబాద్ లో ఇంటి స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కేంద్రం మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.
విష గుళికల నీరు తాగి 8 నెమళ్లు మృతి
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల శివారు దేవిలాల్ తండలో ఒకే సారి 8 నెమళ్లు చనిపోవడం కలకలం రేపుతోంది. రైతులు పొలంలో చల్లేందుకు ఉంచిన విష గుళికల నీటిని తాగి నెమళ్లు చనిపోయినట్టుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని నెమళ్ల మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. విష గుళికలు కలిపిన నీరు తాగడం వలన చనిపోయాయా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నెమళ్లను చంపారనే కోణంలో విచారణ చేపట్టారు. 8 నెమళ్లు ఒకే సారి చనిపోవడంపై జిల్లా అటవీశాఖ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు.
హైదరాబాద్ లో నకిలీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల ముఠా అరెస్టు
హైదరాబాద్ పాతబస్తీ కాలపత్తార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ వాక్సిన్ సర్టిఫికెట్లు తయారుచేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాక్సిన్ తీసుకోకున్నా తీసుకున్నట్టు ఫేక్ సర్టిఫికెట్లు అందిస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి వ్యాక్సిన్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్ జిరాక్స్ లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ లో నకిలీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల ముఠా అరెస్టు
హైదరాబాద్ పాతబస్తీ కాలపత్తార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ వాక్సిన్ సర్టిఫికెట్లు తయారుచేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాక్సిన్ తీసుకోకున్నా తీసుకున్నట్టు ఫేక్ సర్టిఫికెట్లు అందిస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి వ్యాక్సిన్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్ జిరాక్స్ లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
వనమా రాఘన బెయిల్ పిటిషన్ తిరస్కరణ
వనమా రాఘవ బెయిల్ పిటిషన్ ను కోర్టు నిరాకరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సంచలనం సృష్టించిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న వనమా రాఘవ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బెయిల్ పిటిషన్ పై విచారణ నిర్వహించిన స్థానిక కోర్టు బెయిల్ నిరాకరిస్తూ ఉత్తర్వులు వెల్లడించింది.