Breaking News Live: బంజారాహిల్స్ లో లిఫ్టులో ఇరుక్కొని మహిళ మృతి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
మెరుగైన పీఆర్సీ సాధన కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగ సంఘాలు ఏకమయ్యాయి. కృష్ణా జిల్లా విజయవాడలో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించాయి. ఈరోజు ఉదయం 11:30 గంటలకు నేడు మరోసారి సచివాలయంలో అన్ని సంఘాలు భేటీ అయి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. పీఆర్సీపై జారీ చేసిన జీవోలతో ప్రభుత్వ ఉద్యోగులందరికీ నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు.
ఎట్టకేలకు ఏకమైన ఉద్యోగ సంఘాలు
ఏపీలో ప్రధానంగా క్రియాశీలకంగా ఉన్న ఉద్యోగ సంఘాలు 4.. ఇవి రెవెన్యూ ఉద్యోగుల సంఘ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేత సూర్య నారాయణ, ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘ నేత వెంకట్రామి రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీరిలో మిగిలిన సంఘాల నేతలకు సచివాలయ ఉద్యోగ సంఘనేత వెంకట్రామిరెడ్డికీ మధ్య సిద్ధాంత పరంగా కొన్ని విభేదాలు ఉన్నాయని చెబుతుంటారు . అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వీరంతా ఏకం అయ్యారు . దానికోసం విజయవాడలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఏకతాటిపైకి రావాలని నిర్ణయించారు.
ఇకపై మేమంతా ఒకటే..
పీఆర్సీపై పోరుకోసం తామంతా ఏకమయ్యామన్నారు ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. సచివాలయంలో ఈరోజు తామంతా కలిసి చర్చించనున్నట్టు ఆయన తెలిపారు. మెరుగైన పీఆర్సీ సహా తమ ఇతర డిమాండ్ల పై ఇందులో చర్చిస్తామన్నారు. సమావేశంలో జరిగిన చర్చలను జేఏసీ సమావేశంలో తెలియజేస్తామన్నారు. ఈరోజు జరిగే సమావేశం తర్వాత సీఎస్‌కు సమ్మె నోటీసు ఇస్తామనీ, సమ్మె నోటీసుపై వెనక్కి తగ్గేది లేదనీ అన్న బొప్పరాజు , అన్ని ఉద్యోగసంఘాలూ కలిసి శుక్రవారం నాడు ఉమ్మడి కార్యాచరణను తెలుపుతాయని స్పష్టం చేశారు.
ఉద్యోగులు పీఆర్సీ పై భయపడుతున్నారు: సూర్యనారాయణ
కొత్త పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నుండి ఆగ్రహం వ్యక్తం అవుతుందన్న విషయాన్ని ఏపీ ప్రభుత్వం గుర్తించాలనీ, జీతాల కోత తప్పదనే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొని ఉందన్న విషయం అధికార యంత్రాంగం అర్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేత సూర్య నారాయణ అన్నారు. ఇకపై తమందరిదీ ఒకటే మాట అని, తమపోరాటం చరిత్రలో నిలబడిపోతోందని చెప్పారు.
ప్రభుత్వం ఈగోలకు పోవద్దు : వెంకట్రామిరెడ్డి
ఏపీ ప్రభుత్వం అనవసర ఈగోలకు పోకుండా సమస్యలను పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ఉద్యోగులందరి సమస్య ఒకటే కాబట్టి ఉమ్మడిగా ఉద్యమించాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వంపై ఐక్యంగా పోరాడి డిమాండ్లు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్న వెంకట్రామి రెడ్డి, ఒకే వేదికగా పోరాటం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో లిఫ్టులో ఇరుక్కొని మహిళ మృతి
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ లో ఇరుక్కొని ఓ మహిళ మృతి చెందింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్ ఎన్ నగర్ లో ఘటన జరిగింది. ఎల్ నగర్ లోని ఓ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న వీణ (38) లిఫ్ట్ లో ఇరుక్కుని ప్రమాదవశాత్తు మరణించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలో 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి రూ.404.82 కోట్లతో అనుమతులు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ.404.82 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చి మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే వీటి నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం 404.82 కోట్ల రూపాయల్లో 250.02 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించనుండగా 154.80 కోట్లు రైల్వేశాఖ భరిస్తుందని తెలిపారు.
1.చటాన్ పల్లి-షాద్ నగర్
2.ఆదిలాబాద్ మార్కెట్ యార్డు
3.పెద్దపల్లి టౌన్
4.మాధవనగర్,నిజామాబాద్
వచ్చే నెల 7 లేదా ఎనిమిది నుంచి ఏపీ ఉద్యోగ సంఘాలు సమ్మె బాట
అమరావతి.. వచ్చే నెల ఏడు లేదా ఎనిమిది నుంచి ఉద్యోగ సంఘాలు సమ్మె బాట పట్టనున్నాయి. అంతకుముందే ఫిబ్రవరి 3 ఛలో విజయవాడకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి.
మరోవైపు ఏపీ కేబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. ఉద్యోగుల పీఆర్సీ జీవోలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పదవీ విరమణ వయసు 62 ఏళ్ల పెంపునకు క్యాబినెట్ అంగీకరించింది. కరోనా కట్టడిపై సుదీర్ఘంగా చర్చ చరిపారు. క్యాబినెట్ చివరిలో ఉద్యోగుల డిమాండ్లపై మంతులతో సీఎం వైఎస్ జగన్ చర్చించారు.
నేడు ప్రివిలైజ్ కమిటీ ముందు హాజరు కానున్న బండి సంజయ్
ఈ రోజు ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కానున్నారు. ఇందుకోసం గురువారం బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రివిలేజ్ కమిటీ ముందు ఎంపీ బండి సంజయ్ హాజరు అవుతారు. తెలంగాణ పోలీసులు తనను అరెస్టు చేసిన విధానాన్ని పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ తెలియపరుస్తారు. కాగా ఉద్యోగుల బదిలీ గురించి తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 317 ను సవరించాలని బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేస్తూ దీక్ష చేశారు. అయితే బండి సంజయ్ దీక్ష సమయంలో కరోనా నిబంధనలు పాటించలేదని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే.
చినజీయర్ స్వామి వద్దకు మంత్రి హరీశ్ రావు
శంషాబాద్ మండలం పరిధిలోని ముచ్చింతల గ్రామం శ్రీ రామ నగరంలోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమం మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఫిబ్రవరిలో జరిగే శ్రీరామానుజ ఉత్సవాల కార్యక్రమాల వివరాలను మంత్రి హరీష్ రావు చిన్న జీయర్ స్వామిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న ఉత్సవ ఏర్పాట్లను, యాగంలో ఉపయోగించే ఉత్పత్తి కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అనంతరం చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు మంత్రి హరీష్ రావు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో పాటు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు.