Chittoor News: చలాన్ కట్టేందుకు వెళ్లిన భార్యాభర్తలపై సచివాలయ సిబ్బంది దాడి, పట్టించుకోని పోలీసులు
Chittoor District News : భూమి సర్వే చేసేందుకు చలానా కట్టేందుకని వెళ్లిన భార్యభర్తలపై సచివాలయం సిబ్బంది దాడికి పాల్పడ్డారు. సాయం చేయాలని పోలీసులను ఆశ్రయించగా కనీసం పట్టించుకోలని ఆవేదన చెందారు.
Chittoor News : భూమి సర్వే చేసేందుకని చలాన్ కట్టేందుకు వెళ్లిన భార్యభర్తలపై సచివాలయ సిబ్బంది దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని ఏతూరు సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం చిన్న నల్లూరుపల్లి గ్రామానికి చెందిన కౌసల్య, లక్ష్మీపతి దంపతులు చలానా కట్టేందుకని సచివాలయానికి వెళ్లారు. ఆ సమయంలో సచివాలయ సిబ్బంది నిరంజన్ రెడ్డి, సర్వే చలానా కట్టేందుకు వచ్చిన భార్య భర్తల పై దాడి చేసి సచివాలయం నుంచి బయటకు గెంటేశాడు. బాధితులు సాయం కోసమని పోలీసులను ఆశ్రయించారు. కానీ పోలీసులు తమ ఫిర్యాదు తీసుకోలేదని బాధితురాలు కౌసల్య ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై బాధితులు ఏం చెప్పారంటే..
ఈ సందర్భంగా బాధితులు కౌసల్య మాట్లాడుతూ.. తమది నల్లూరుపల్లి గ్రామమని.. వారికి ఏతూరు గ్రామ పంచాయతీ పరిధిలో 43సెంట్ల భూమి ఉన్నట్లు చెప్పుకొచ్చారు. తమ భూమిని ఆ ప్రాంతానికి చెందిన కొందరు కబ్జా చేశారని తెలిపారు. ఈ భూమికి సంబంధించి తన తాత పేరు మీద పట్టా ఉన్నట్లు తెలిపారు. అధికారులు భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మార్పిడి చేసినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత పుంగనూరు కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నట్లు ఆమె తెలిపారు. కోర్టు ఆర్డర్ ను కూడా లెక్క చేయకుండా వారు అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్టు కౌసల్య చెప్పారు. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించి ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పోలీసులను, ఎమ్మార్వోను కలిసి పొట్రెక్షన్ ఆర్డరు ఇచ్చామన్నారు. కానీ ఎమ్మార్వో సర్వేయర్ కోసం డబ్బులు కట్టుకోవాలని సూచించినట్లు ఆమె చెప్పారు.
మధ్యాహ్నం సమయలో సర్వే కోసం చలాన్ కట్టేందుకు వెళ్లితే తమ పట్ల సచివాలయ సిబ్బంది దాడి చేసి బయటకు గెంటేసినట్లు తెలిపారు. ఎన్ని విధాలుగా లీగల్ గా వెళ్తున్నా వాళ్లు ఇలా దౌర్జన్యం చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే సీఐ సెలవులో ఉన్నారని కనీసం పట్టించుకోలేదని కౌసల్య తెలిపారు.