Andhra Covid 19 Cases: ఏపీలో 1,115 కరోనా కేసులు నమోదు.. కరోనా నుంచి కోలుకొని 1,265 మంది డిశ్ఛార్జి
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 52,319 నమూనాలను పరీక్షించగా 1,115 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 1,115 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,14,116కి చేరింది. కొత్తగా 19 మంది కరోనా మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 13,857కి పెరిగింది. తాజాగా 1,265 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం 14,693 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు బులిటెన్ విడుదల చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,66,29,314 నమూనాలను పరీక్షించినట్లు బులెటిన్ లో వైద్యారోగ్య శాఖ పేర్కొంది. చిత్తూరు, కృష్ణా జిల్లా్ల్లో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున వైరస్ కారణంగా చనిపోయారు.
#COVIDUpdates: 31/08/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) August 31, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,11,221 పాజిటివ్ కేసు లకు గాను
*19,82,671 మంది డిశ్చార్జ్ కాగా
*13,857 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 14,693#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/dbGhdSbfNd
కరోనా చికిత్సపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణ
కరోనా చికిత్సపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో కేసులు పెరగడంపై హైకోర్టు ఆరా తీసింది. టీచర్లు, న్యాయవాదులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందని హైకోర్టు ప్రశ్నంచింది. సెప్టెంబర్ 8 నాటికి స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. జనం గుమిగూడే ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని తెలిపింది. అధిక కేసులున్న జిల్లాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని హైకోర్టు సూచించింది.
ఏపీలో 45 ఏళ్లు పైబడిన వారికి 90శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని ప్రభుత్వం పేర్కొంది. మిగిలిన వారికి వ్యాక్సినేషన్ జరుగుతుందని ప్రభుత్వ తరఫున న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు. 28 ప్లాంట్లకు గాను 18 పూర్తయినట్లు కేంద్రం తరపున అఫిడవిట్ దాఖలు చేశారు.
విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస లక్ష్మీ నగర్‌లోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో.. విద్యార్థులకు కొవిడ్ పరీక్ష నిర్వహించారు. పాఠశాలకు చెందిన ఒక ఉపాధ్యాయుడికి కొవిడ్ సోకడంతో సిబ్బంది, టీచర్లు, పలువురు విద్యార్థులకు టెస్టులు నిర్వహించగా.. నలుగురు విద్యార్థులకు పాజిటివ్‌గా తెలింది. పదకొండు వందల మంది పిల్లలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. పాఠశాలలో ప్రస్తుత పరిస్థితిని మున్సిపల్ కమిషనర్‌తోపాటు విద్యాశాఖ అధికారులకు వివరించినట్లు చెప్పారు. అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.