Andhra Pradesh: ఏపీలో ఐదు మెడికల్ కాలేజీలు, ఈ ఏడాదిలో ప్రారంభం: మంత్రి విడదల రజిని
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాదిలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నట్లు మంత్రి రజినీ వెల్లడించారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది ఐదు వైద్య కళాశాలలు ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, నంద్యాల, మచిలీపట్నం మెడికల్ కాలేజీల్లో ఆగస్టులో సీట్లు భర్తీ చేస్తామని తెలిపారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి క్లాసులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. కొత్తగా ప్రారంభమయ్యే ఐదు వైద్య కళాశాలల నుంచి 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 462 మెడికల్ పీజీ సీట్లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో చాలా ఏళ్ల క్రితం విశాఖలో తొలి మెడికల్ కాలేజీ ప్రారంభం అయిందని, వందేళ్ల కాలంలో 11 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. జగన్ మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఒక్కో మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ చరిత్రలో ఇది ఒక చరిత్రగా పేర్కొన్నారు మంత్రి విడదల రజిని.
'మెరుగైన వైద్యం అందించాలన్నదే లక్ష్యం'
ప్రజలు అందరికీ మెరుగైన వైద్యం అందించాలని వైసీపీ సర్కారు లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖలో వైఎస్సార్సీపీ సర్కారు భర్తీ చేసినన్ని ఖాళీలు ఏ ప్రభుత్వం భర్తీ చేయలేదని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో నాలుగేళ్లలో 49 వేల పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి విడదల రజిని గుర్తు చేశారు.
'బాబు పాలనలో దోచుకో, దాచుకో విధానం'
మంత్రి విడదల రజిని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. దోచుకో, దాచుకో విధానం చంద్రబాబు పాలనలో జరిగిందని ఆరోపణలు చేశారు. ఒక్క ప్రభుత్వ కాలేజీ కుడా బాబు పాలనలో రాష్ట్రంలో రాలేదని విమర్శలు గుప్పించారు. గుంటూరులో మాట్లాడిన మంత్రి విడదల రజిని... ప్రతి పార్లమెంట్ పరిధిలో వైద్య కళాశాల ఏర్పాటుకు వైఎస్ జగన్ మెహన్ రెడ్డి కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించడం ఆనందదాయకమని పేర్కొన్నారు.
'ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే జగన్ లక్ష్యం'
రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఎంబీబీఎస్ సీట్లతో పాటు రాష్ట్రంలో 462 పీజీ సీట్లు కూడా పెరిగాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చినట్లు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖలో వైసీపీ సర్కారు భర్తీ చేసినన్ని ఖాళీలు ఏ ప్రభుత్వమూ చేయలేదని ఉద్ఘాటించారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో ఒక్క వైద్య కాలేజీ కూడా రాలేదన్నారు. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ దవాఖానాల్లో సెల్ ఫోన్ వెలుతురులో ఆపరేషన్లు జరిగాయని గుర్తు చేశారు.