Indian Railway: తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లు, సర్వేకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్
Indian Railway: రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6 నెలల్లో సర్వే చేయాలని అధికారులను ఆదేశించింది.
Indian Railway: దేశంలో హైస్పీడ్ రైలు ప్రయాణాలపై దృష్టి పెట్టిన కేంద్ర సర్కారు అందుకోసం పటిష్టమైన ట్రాక్ ల నిర్మాణాలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అవసరమైన సర్వేకు రైల్వే బోర్డు తాజాగా ఆమోదం తెలిపింది. ఆరు నెలల లోపు సర్వే పూర్తి చేయాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలోని విశాఖపట్నం - విజయవాడ - తెలంగాణలోని శంషాబాద్ మధ్యలో మొదటి ట్రాక్, విశాఖపట్నం - విజయవాడ - కర్నూలు రూట్ లో రెండో రైల్వే లైన్ కోసం సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలిపింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. ఈ రెండు మార్గాల్లో సూపర్ ఫాస్ట రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన టెక్నికల్ ఫిజిబిలిటీని ఈ సర్వే ద్వారా నిర్ధారిస్తారు. సర్వే అయిన తర్వాత అనుకూలతలను బట్టి ప్రాజెక్టుపై రైల్వే బోర్డు ముందడుగు వేయనుంది.
ఈ సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు సంబంధించి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పలుమార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి, లేఖలు కూడా సమర్పించారు. ఈ సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల ద్వారా తెలుగు రాష్ట్రాలకు చేకూరే లబ్ధి గురించి వివరించారు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు తాజాగా ఈ రెండు రూట్లలో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు నిర్ణయం తీసుకుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ రెండు రైల్వే లైన్లు కలిపి 942 కిలోమీటర్ల మార్గంలో గరిష్ఠంగా 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ట్రాక్ నిర్మాణ అనుకూలతపై సర్వే చేయనున్నారు. ఈ సర్వేను ఆరు నెలల్లో పూర్తి చేయాలని రైల్వే బోర్డు ఆదేశించింది.
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, వై-ఫైలు, రూ.30 వేల కోట్ల విలువైన డబ్లింగ్, ట్రిప్లింగ్ లైన్లు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లను కేంద్ర సర్కారు అందించింది. తెలంగాణ రాష్ట్రంలో వ్యాగన్ తయారీ, ఓవర్ హాలింగ్ కేంద్రాన్ని, ఎంఎంటీఎస్ (రెండో దశ), సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, చర్లపల్లి టర్మినల్ వంటి ప్రాజెక్టులను కేంద్ర సర్కారు చేపట్టింది.
షాద్‌నగర్, మహబూబ్‌నగర్‌లో రైళ్లు ఆపాలి: కిషన్ రెడ్డి
ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో కొన్ని రైల్వే స్టేషన్లలో రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కొన్ని రోజుల క్రితం కిషన్ రెడ్డి లేఖ రాశారు. యశ్వంత్ పూర్- హజరత్ నిజాముద్దీన్ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు మహబూబ్‌నగర్, షాద్ నగర్ రైల్వే స్టేషన్లలో ఆపేలా చర్యలు తీసుకోవాలని తన లేఖలో కోరారు. ఆ రైలు కాచిగూడ నుంచి బయలుదేరి ఎక్కడా ఆగకుండా 200 కిలోమీటర్లు ప్రయాణించి కర్నూలు చేరుకుంటుందన్నారు. కానీ ఇంత దూరంలో కనీసం ఎక్కడా స్టాప్ లేదని, మహబూబ్ నగర్, షాద్ నగర్ లాంటి రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగేలా చేయాలని కిషన్ రెడ్డి ప్రతిపాదించారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ఈ ప్రాంత వాసులు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం ఉందన్నారు. చెంగల్ పట్టు - కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలుకు షాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో స్టాప్ ఏర్పాటు చేయాలని కోరారు.