AP Pulse Polio Drive: నేడు ఏపీలో పల్స్ పోలియో.. 54 లక్షల మందికి పైగా పిల్లలకు పోలియో చుక్కలు
Andhra Pradesh Pulse Polio | నేడు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కుల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 54 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేపించాలని అధికారులు సూచించారు.

AP Pulse Polio | అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా నేడు (డిసెంబర్ 21న) పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కాకినాడ పట్టణ ఆరోగ్య కేంద్రంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. రాష్ట్రంలోని 54,07,663 మంది చిన్నారుల కోసం ఇప్పటికే 98,99,300 వ్యాక్సిన్ డోస్‌లను అన్ని జిల్లాలకు పంపిణీ చేశారు.
పోలియో నిర్మూలన
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 2014లోనే భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించినప్పటికీ, పొరుగు దేశాలైన పాకిస్థాన్ మరియు ఆఫ్ఘనిస్థాన్‌లలో వైరస్ ప్రభావం ఇంకా ఉండటంతో భారత్ అప్రమత్తంగా ఉంది. రాష్ట్రంలో చివరి కేసు 2008లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నమోదైంది. పోలియో మహమ్మారిని దేశం నుండి పూర్తిగా తరిమికొట్టేందుకు 1995 నుండి నేషనల్ ఇమ్యునైజేషన్ డే నిర్వహిస్తున్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు మరియు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి వైద్యారోగ్య శాఖ నిరంతరం శ్రమిస్తోంది.
టీకా పంపిణీ విధానం
సాధారణ ఇమ్యునైజేషన్ షెడ్యూల్‌లో భాగంగా పిల్లలకు ఐదు డోసుల ఓపీవీ చుక్కలు వేస్తారు. అయితే, పల్స్ పోలియో రోజున అదనంగా మరో రెండు చుక్కల (ఒక డోస్) వ్యాక్సిన్ అందిస్తారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 38,267 బూత్‌లలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఈ సేవలు అందిస్తారు. ఈ భారీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు నోడల్ ఆఫీసర్లను, 4,206 మంది సూపర్వైజర్లను ఏపీ ప్రభుత్వం నియమించింది.
ఇంటింటికీ తనిఖీ, మొబైల్ బృందాలు
మొదటి రోజున బూత్‌లకు రాలేని పిల్లల కోసం డిసెంబర్ 22, 23 తేదీలలో 76,534 బృందాలు ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేస్తాయి. చుక్కలు వేసిన ఇళ్లకు 'P' గుర్తును, వేయని పక్షంలో 'X' గుర్తును కేటాయిస్తారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు వంటి రద్దీ ప్రదేశాలలో ప్రయాణికుల కోసం 1,140 ట్రాన్సిట్ బూత్‌లను ఏర్పాటు చేశారు. మురికివాడలు, వలస ప్రాంతాలు, నిర్మాణ స్థలాల్లో ఉన్న పిల్లల కోసం 1,854 మొబైల్ బృందాలు నిరంతరం పర్యటిస్తాయి.
మంత్రి పిలుపు, జనం భాగస్వామ్యం
ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని, తద్వారా రాబోయే తరాలను ఈ వ్యాధి నుండి కాపాడాలని కోరారు. వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.






















