AP Election 2024 Polling Percentage: ఏపీలో 6 నియోజకవర్గాల్లో ముగిసిన ఓటింగ్, సాయంత్రం 5 వరకు 68 శాతం పోలింగ్ నమోదు
AP Election 2024 Voting Percentage Till 5 pm: ఆంధ్రప్రదేశ్ లో సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 68 శాతం నమోదైంది. సాయంత్రం 6 లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు అవకాశం కల్పిస్తున్నారు.
AP Election 2024 Voting Percentage - ఏపీలో అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 68 శాతం ఓటింగ్ నమోదైంది. కొన్నిచోట్ల వైసీపీ, టీడీపీ వర్గీయులు పరస్పర దాడులు చేసుకున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాల్లో పోలింగ్ ముగియగా.. పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అక్కడ క్యూలైన్లలో నిల్చున్న వారిని ఓటు వేసేందుకు సిబ్బంది అనుమతిస్తున్నారు.
ఏపీలోని మిగిలిన 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఆ టైమ్ వరకు క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటింగ్ ఛాన్స్ ఇస్తారు. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు సీఈవో ముకేష్ కుమార్ మీనా పర్యవేక్షిస్తున్నారు. విశాఖపట్నంలో ఓటింగ్ శాతం అతి తక్కువగా నమోదైంది.