‘ముందస్తు’గానే చెప్పేశారు- ప్రత్యర్థుల ప్రచారానికి చెక్‌పెట్టిన జగన్
గతకొన్నిరోజులుగా ఏపీలో విపక్షాలు ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న విధంగా మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షం టిడిపి. అయితే వైసీపీ అధినేత ముఖ్యమంత్రిగా ఉండేది కొన్నిరోజులే అని తెగ భాజా మోగించింది.
గతకొన్నిరోజులుగా ఏపీలో విపక్షాలు ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న విధంగా మాట్లాడారు. రేపో మాపో సిఎం జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రిగా ఉండేది కొన్నిరోజులే అని తెగ ప్రచారం చేసింది. అతి త్వరలోనే జగన్ని సీబీఐ జైల్లో పెడుతుందని కూడా జోస్యం చెప్పింది. చంద్రబాబు, తెలుగు తమ్ముళ్లే కాదు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఈ వ్యాఖ్యలే చేశారు. త్వరలోనే ముందస్తు ఉంటాయన్న విధంగా మాట్లాడారు.
విపక్షాల వ్యాఖ్యలకు సమాధానం ఇస్తూ ఏపీ సిఎం జగన్ ముందస్తుపై క్లారిటీ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టుని వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. అంతేకాదు ఆ ప్రాజెక్టు ప్రారంభించాకే ఎన్నికలకు వెళ్తామని కూడా మాట్లాడారు. అంటే ముందస్తు ఎన్నికలు లేవని చెప్పకనే చెప్పేశారంటున్నారు రాజకీయవిశ్లేషకులు.
151 సీట్లతో గత ఎన్నికల్లో ఏపీలో అధికారాన్ని అందుకున్న వైసీపీ వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. అందులో భాగంగానే జగన్ ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలు చేశారు. ప్రతీ వైసీపీ నేత, అధికారి ప్రతీ ఇంటి గుమ్మంలోకి అడుగుపెట్టి ప్రభుత్వ సంక్షేమాలు అందుతున్నాయో లేదో తెలుసుకుంటున్నారు. జగన్ పాలనా తీరుపైనా అభిప్రాయాలు సేకరిస్తున్నారు. మేనిఫోస్టోలోని పథకాలే కాకుండా జగన్ ప్రభుత్వం కొత్త వాటిని కూడా అమలు చేయడంతో రానున్న ఎన్నికల్లో విపక్షం లేకుండా చేయగలమన్న ధీమాతో ముందుకు పోతోంది.
వైసీపీని ఎదుర్కోవడానికి టిడిపి పక్కా వ్యూహాన్ని రచిస్తోంది. గతంలో వైసీపీ వెళ్లిన దారిలోనే వెళ్లాలని భావిస్తోంది. బీజేపీతో చేతులు కలపాలని ప్రయత్నాలు మొదలెట్టింది. అదే టైంలో ప్రభుత్వ లోపాలు ఎత్తిచూపుతూ బాదుడే బాదుడు అంటూ ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. చంద్రబాబు సభలకు భారీగాా జనసమీకరణ చేస్తుంది.
జనసేన కూడా ఊపు మీద కనిపిస్తోంది. ఎలాగైనా సరే జగన్ని గెలవనీయకూడదన్న లక్ష్యంతో వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ నినాదంతో ఈ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు పవన్ ప్రకటించారు. జగన్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఏపీలో రేపోమాపో ఎన్నికలన్నట్లు వాతావరణం హాట్ హాట్ గా నడిచింది. అంతేకాదు జగన్ పథకాలు, నిర్ణయాలన్నింటికి వివిధ మార్గాల్లో చెక్ పెడుతూ ప్రధాన ప్రతిపక్షం ఆటంకాలు సృష్టిస్తోందని వైసీపీ ఆరోపించడమే కాదు వచ్చే ఎన్నికల్లో ఈ విషయాలనే ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ప్లాన్ లో ఉంది.
బాబు వ్యూహం బాబుది.
టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఎన్నికలెప్పుడైనా వస్తాయని, అందుకు తమ్మళ్లు అంతా సిద్దంగా ఉండాలని మొన్న వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు. నియోజకవర్గాల్లో బాగా పని చేసేవారికే టిక్కెట్లు అంటూ సంకేతాలు ఇచ్చారు. బాబు మాత్రం 175 సీట్లకు ఎమ్మెల్యే అభ్యర్థులను రెడీ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. కొందరు నేతలకు మీకు ఫలానా నియోజకవర్గం టిక్కెట్ గ్యారెంటీ ఇచ్చారంట. ముందు మీరు వెళ్లి మీ మీ నియోజకవర్గాల్లో పని చేసుకోండి, వీలైంత ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టి దాన్ని ఓటు బ్యాంకుగా మరల్చుకోవాలని చంద్రబాబు సూచించారని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇంటిని చక్క పెడుతున్న పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ కూడా వచ్చే ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇంటిని చక్కదిద్దే పనిలో పడ్డారాయన. పార్టీలో కోవర్టులకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో ఉంటే ఉండండీ, లేకపోతే పోండంటూ చెప్పేశారు. పార్టీలో టిక్కెట్ ఆశావాహులకు కొన్ని సంకేతాలు కూడా ఇస్తున్నారంట. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జన సైనికులంతా సిద్దంగా ఉండాలని ఇంటర్నల్ మీటింగ్స్ ఆ పార్టీ థింక్ ట్యాంక్ సంకేతాలుపంపిస్తున్నది.
ఇలా ఏపీలో అధికార, విపక్షాలన్నీ ఎవరి వ్యూహాల్లో వాళ్లు ముందుకెళ్తూ ప్రతీ క్షణం పొలిటికల్ వార్ టెన్షన్ టెన్షన్ గా ఉంటోంది.