AP Assembly Session-2024: ఇవాళ్టితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు-సభ ముందుకు రెండు బిల్లులు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లు-2024, ఏపీ ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు-2024ను శాసనసభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.
AP Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి(గురువారం)తో ముగియనున్నాయి. చివరి రోజు.. వివిధ శాఖలకు చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనుంది ఏపీ ప్రభుత్వం. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చించిన తర్వాత... ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సమాధానం ఇస్తారు. ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అలాగే మరో రెండు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత శాసనసభను నిరవధికంగా వాయిదా వేయనున్నారు సభాపతి తమ్మినేని సీతారాం.
ఈనెల 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాలు తెలిపింది సభ. ఇక.. మూడో రోజు (ఫిబ్రవరి 7న) ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. మరోవైపు... అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం, బుధవారం రెండు రోజులపాటు గందరగోళం నెలకొంది. పది మంది తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే రైతు సమస్యలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు సభలో నిరసనకు దిగారు. పోడియంపైకి వెళ్లి ఆందోళన చేపట్టారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ... కాగితాలు చించి విసిరేశారు. దీంతో సభలో గందరగోళం కొనసాగింది. టీడీపీ సభ్యుల నిరసనల మధ్యే మూడు బిల్లులను మంత్రులు సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అప్పటికీ టీడీపీ సభ్యులు తమ నిరసనను కొనసాగిస్తుండటంతో వారిపై చర్యలు తీసుకోవాలని సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రతిపాదించారు. పది మంది ఎమ్మెల్యేలను సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేసినట్లు స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్ చేసినా టీడీపీ సభ్యులు సభలో నుంచి బయటకు వెళ్లకపోవడంతో... మార్షల్స్ వచ్చి వారిని బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. శాసనమండలిలోనూ టీడీపీ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. ఇక.. ఇవాళ (గురువారం) సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.. ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లు-2024, ఏపీ ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు -2024ను సభ ముందుకు తీసుకురానుంది.
ఇక, శాసనమండలిలోనూ ఇవాళ (గురువారం) పలు శాఖలకు చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనుంది వైఎస్ జగన్ ప్రభుత్వం.. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై మండలిలో చర్చిస్తారు. చర్చ తర్వాత మండలిలో కూడా సమాధానం ఇవ్వనున్నారు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి. మరోవైపు.. మండలిలో మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.. నిన్న అసెంబ్లీ ఆమోదించిన మూడు బిల్లులను ఇవాళ శాసనమండలిలో పెట్టనుంది వైఎస్‌ఆర్‌సీపీ సర్కార్. మొత్తంగా నాలుగు రోజుల పాటు జరిగిన ఆంధ్రప్రదేశ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ ఇవాళ్టితో ముగుస్తాయి.