Pawan Kalyan: విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదం - బాధితులకు జనసేనాని ఆర్థిక సాయం
Andhra News: విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనలో బాధిత మత్స్యకార కుటుంబాలకు జనసేనాని పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. ఒక్కో కుటుంబానికి జనసేన తరఫున రూ.50 వేలు అందిస్తామని ప్రకటించారు.
Pawan Kalyan Helped Visakha Harbor Fishermen: విశాఖ ఫిషింగ్ హార్బర్ (Visakha Fishing harbor) లో జరిగిన ప్రమాదంలో బోట్లు నష్టపోయిన బాధితులకు జనసేన (Janasena) అండగా నిలిచింది. ఈ ఘటనలో 60కి పైగా బోట్లు దగ్ధం కాగా, బాధిత మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 2, 3 రోజుల్లో బాధితులను స్వయంగా కలిసి ఆర్థిక సాయం అందిస్తానని పవన్ తెలిపారు. బాధిత కుటుంబాలకు జనసేన అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 60కి పైగా బోట్లు దగ్ధమయ్యాయి. ఓ బోటు నుంచి మంటలు అంటుకుని ఇతర బోట్లకు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడికి హుటాహుటిన చేరుకుని ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. ఆస్తి నష్టం తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.
మత్స్యకారుల సంక్షేమ దిశగా అడుగులు
రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో మత్స్యకారుల సంక్షేమ దిశగా అడుగులు వేస్తామని జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కడలినీ, కాయ కష్టాన్నీ నమ్ముకొన్న మత్స్యకారులు నిరంతరం ఆటుపోట్లతో జీవనం సాగిస్తున్నారని అన్నారు. మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి కల్పనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మెరైన్ ఫిషింగ్ కి తగిన విధంగా సుదీర్ఘ తీరం ఉన్న రాష్ట్రంలో ఇన్ ల్యాండ్ ఫిషింగ్ కి అనువుగా ఎన్నో జల వనరులు ఉన్నాయని, కానీ, మన మత్స్యకారులకు తగిన జీవనోపాధి లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారని చెప్పారు. రాష్ట్ర పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని పేర్కొన్నారు.
'ప్రభుత్వ నిర్లక్ష్యం'
గుజరాత్, కేరళ తీరాల్లో ప్రతి 30 కి.మీకు ఓ జెట్టీ ఉండడంతో మత్స్యకారుల ఉపాధికి, వేటకి సౌలభ్యంగా ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. కానీ, మన రాష్ట్రంలో జెట్టీలు, హార్బర్లు నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతున్నా అవి కార్యరూపం దాల్చడం లేదని మండిపడ్డారు. సీఎం అధికారిక నివాసానికి రూ.450 కోట్ల నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైన ప్రభుత్వం, మత్స్యకారులకు జెట్టీలు, హార్బర్లు నిర్మాణానికి మాత్రం ఆసక్తి చూపటం లేదని దుయ్యబట్టారు. రుషికొండపై నిర్మితమవుతున్న రాజ మహల్ కోసం చేస్తున్న ఖర్చుతో ఓ హార్బర్, 7 జెట్టీలు నిర్మించవచ్చని, కానీ అలా చేయడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి మత్స్యకారుల ఉపాధి, సంక్షేమం కన్నా, రుషికొండలో నిర్మాణాలే ముఖ్యమని ఎద్దేవా చేశారు. మత్స్యకారులకు సంబంధించిన సంక్షేమ పథకాల అమలులోనూ నిబంధనల పేరుతో కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. వారికి అందించే వలలు, డీజిల్ రాయితీలపైనా ఈ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి ప్రభుత్వంలో ప్రత్యేక దృష్టి
అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ప్రభుత్వంలో మత్స్యకారులకు హామీలు, శంకుస్థాపనలతో సరి పెట్టకుండా వారికి ఉపాధి కల్పనపై ఓ ప్రణాళికతో ముందుకెళ్తామని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా తీర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తీర గ్రామాల్లో విద్య, వైద్య వసతుల మెరుగుదలపై, మత్స్యకార కుటుంబాల్లోని మహిళలు, వృద్ధుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతామని తన ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read: CM Jagan Released Funds: మత్స్యకార కుటుంబాలకు నిధులు విడుదల - ఖాతాల్లో రూ.161.86 కోట్లు జమ