CM Jagan Released Funds: మత్స్యకార కుటుంబాలకు నిధులు విడుదల - ఖాతాల్లో రూ.161.86 కోట్లు జమ
Andhra News: ఓఎన్జీసీ పైప్ లైన్ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ఏపీ సీఎం జగన్ నిధులు విడుదల చేశారు. 23,548 కుటుంబాలకు రూ.161.86 కోట్లు జమ చేశారు.
CM Jagan Released Funds to Fishermen: అంబేడ్కర్ కోనసీమ (Konaseema), కాకినాడ (Kakinada) జిల్లాల్లోని మత్స్యకార కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం మంగళవారం నిధులు విడుదల చేసింది. ఓఎన్జీసీ పైప్ లైన్ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార (Fishermen) కుటుంబాలకు సీఎం జగన్ నిధులు విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని సూళ్లూరుపేటలో (Sullurupeta) జరుపుకోవాలని అనుకున్నా, వర్షాల తాకిడితో అక్కడికి చేరుకునే పరిస్థితి లేక, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిధులు విడుదల చేస్తున్నట్లు జగన్ తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో బటన్ నొక్కి మొత్తం 23,458 కుటుంబాలకు రూ.161.86 కోట్లను ఖాతాల్లో జమ చేశారు. పైప్ లైన్ కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు నెలకు రూ.11,500 చొప్పున 6 నెలలకు రూ.69,000 అందనుంది.
ఇప్పటికే 3 విడతల పంపిణీ
ఓఎన్జీసీ పైపులైన్ నిర్మాణం వల్ల, జరుగుతున్న తవ్వకాల వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో, అంబేద్కర్ కోనసీమ (Konaseema) జిల్లాల్లో 16,408 మంది మత్స్యకారుల కుటుంబాలకు, కాకినాడ జిల్లాలో మరో 7,050 మంది, మొత్తంగా 23,458 మంది మత్స్యకారుల కుటుంబాలకు కలిగిన నష్టాన్ని భర్తీ చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. మత్స్యకారులకు పరిహారం విషయంలో ఓఎన్జీసీతో మాట్లాడి 3 దశలో రూ.323 కోట్ల పరిహారం ఇప్పటికే ఇప్పించినట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రూ.161 కోట్ల నాలుగో విడత నిధులను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. మొత్తంగా రూ.485 కోట్ల పరిహారం అందించినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఓఎన్జీసీ అధికారులకు ప్రభుత్వం తరఫున సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబుపై విమర్శలు
నిధుల విడుదల సందర్భంగా చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శలు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకార కుటుంబాలకు తోడుగా ఉండాలన్న ఆలోచన కనీసం చేయలేదని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక, ప్రత్యేక దృష్టి సారించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి డబ్బులు ఇప్పించుకోగలిగినట్లు చెప్పారు. మత్స్యకారులకు మంచి చేయడంలో తాము ముందుంటామని, ఎప్పుడూ వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంపై
విశాఖ ఫిషింగ్ హార్బరులో సోమవారం ప్రమాదం జరిగిన వెంటనే స్పందించినట్లు సీఎం జగన్ తెలిపారు. బోట్లు దగ్ధమయ్యాయని తెలియగానే, బాధిత మత్స్యకారులకు సాయం అందేలా చర్యలు చేపట్టామన్నారు. దగ్ధమైన బోట్ల విలువ లెక్కగట్టి 80 శాతం ప్రభుత్వమే ఇచ్చేలా ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు. ఆ సాయం కూడా మంగళవారమే అందేలా మంత్రులు, అధికారులకు నిర్దేశించినట్లు చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
కాగా షెడ్యూల్ ప్రకారం, తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు, పులికాట్ సరస్సు ముఖద్వారం పునరుద్ధరణ పనులు సహా మరికొన్ని పనులను సీఎం జగన్ మంగళవారం ప్రారంభించాల్సి ఉండగా పర్యటన వాయిదా పడింది. ఈ కార్యక్రమాన్ని వీలును బట్టి ఈ నెలాఖరులోనో, వచ్చే నెలలోనో చేపడతామని ప్రకటించారు.
Also Read: Chandrababu Bail: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం