World Cup Final 2023: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, ఫైనల్ మ్యాచ్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 13 భారీ స్క్రీన్లు
IND vs AUS Final 2023: భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరిగే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు 13 భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డి తెలిపారు.
IND vs AUS Final 2023 Arrangements In AP: ఆంధ్రప్రదేశ్‌లోని క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (Andhra Cricket Association) గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ – ఆస్ట్రేలియా (IND vs AUS Final 2023) మధ్య ఆదివారం జరిగే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రజలు ఒకే చోట వీక్షించేలా రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.గోపీనాథ్‌రెడ్డి (Gopinath Reddy) తెలిపారు. 2 లక్షల మంది మ్యాచ్ చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ ప్రవేశం పూర్తి ఉచితమని చెప్పారు. ఇందుకయ్యే ఖర్చు మొత్తం అసోసియేషన్ భరిస్తోందని తెలిపారు.
తొలిసారి ఏర్పాటు
దేశంలోనే తొలిసారిగా సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం విశాఖ, కడప, విజయవాడలో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్లకు మంచి స్పందన వచ్చిందని ఆయన చెప్పారు. ఈ ఉత్సాహంతో ఫైనల్ మ్యాచ్ కోసం ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నిర్ణయాన్ని సీఎం వైఎస్ జగన్ అభినందించారని, ప్రతి చోటా కనీసం 10 వేల మంది కూర్చొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మ్యాచ్ చూడడానికి వచ్చే వారి కోసం ఆర్‌జే, డీజే, ప్రత్యేక లైటింగ్, అధునాతన సౌండ్ సిస్టమ్స్, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
విశాఖలో త్వరలో కొత్త స్టేడియం
విశాఖలో రూ.300 కోట్లతో 50 వేల మంది సామర్థ్యంతో నూతన స్టేడియం నిర్మాణం విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. వెంటనే స్థలాన్ని కేటాయించాలని ఆదేశాలు జారీ చేసిన ట్లు తెలిపారు. రూ.100 కోట్లు విలువ చేసే స్థలాన్ని కేటాయిస్తున్నారని, అన్నీ అనుకూలిస్తే త్వరలోనే స్టేడియంకు శంకుస్థాపన చేస్తామని అన్నారు.
జోరుగా స్టేడియంల నిర్మాణం
రాష్ట్రంలో నెల్లూరులో, పశ్చిమ గోదావరిలో స్టేడియంల నిర్మాణం జరుగుతోందన్నారు. పులివెందుల స్టేడియం పనులు తుది దశలో ఉన్నాయని, మెషినరీ, నెట్లు, సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఏపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించడంతో ఏసీఏకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. పదేళ్లుగా ప్రీమియర్ లీగ్స్ నిర్వహిస్తున్న తమిళనాడు, కర్ణాటక కంటే ఆంధ్రాకే మంచి ర్యాంకింగ్ వచ్చిందని చెప్పారు.
ముమ్మరంగా ఏర్పాట్లు
క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్, మహా సంగ్రామానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు కప్పు కోసం తలపడనున్నాయి. క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్-ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కోసం బీసీసీఐ, ఐసీసీ సంయుక్తంగా భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాయి.
రోజు మొత్తం క్రికెట్ అభిమానులను అలరించేలా బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. మ్యాచ్‌కు ముందు భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం పది నిమిషాల పాటు ఎయిర్ షో ఉండనుంది. అలాగే కంపోజర్ ప్రీతమ్ ప్రదర్శనతో సహా అనేక ఈవెంట్లను బీసీసీఐ ప్లాన్ చేసింది. ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ కూడా హాజరవుతారని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కార్యాలయం తెలిపింది.