(Source: ECI/ABP News/ABP Majha)
Mla Suryanarayana : చంద్రబాబుకు దమ్ముంటే నాపై పోటీ చేసి గెలవాలి- అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి
Mla Suryanarayana : టీడీపీ అధినేత చంద్రబాబుపై అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ మండిపడ్డారు. దమ్ముంటే అనపర్తిలో పోటీచేయాలని సవాల్ చేశారు.
Mla Suryanarayana :టీడీపీ అధినేత చంద్రబాబుకు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో తనపై పోటీ చేసి గెలవాలని అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సవాల్ విసిరారు. అనపర్తిని రెండో పులివెందులా అని వ్యాఖ్యానించిన చంద్రబాబు..ఇక్కడ నుంచి పోటీ చేసి తనపై గెలవాలని ఛాలెంజ్ చేశారు. తనపై అవినీతి ఆరోపణలు చేసిన చంద్రబాబుకు మరో సవాల్ చేశారు సూర్యనారాయణరెడ్డి. చంద్రబాబు కానీ ఆయన కొడుకు లోకేశ్ కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ల ఆస్తులెన్నీ? ఇప్పుడెన్ని ఆస్తులున్నాయని నిలదీశారు. చంద్రబాబుకు దమ్ముంటే ఆస్తుల లెక్కలపై సీబీఐకి లెటర్ రాయాలని సవాల్ విసిరారు. ఇప్పటివరకు అనపర్తిలో ఎప్పుడూ కులాల ప్రస్తావన లేదని.. ఇప్పుడు చంద్రబాబు వచ్చి కులాల ప్రస్తావన తీసుకొచ్చి చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పక్కన ఉన్న అవినీతిపరుల గురించి అందరికీ తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. అనపర్తిలో చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులపై దౌర్జాన్యానికి దిగడం దారుణం అన్నారు. టీడీపీ నేతల చేష్టలను ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీ హయంలో అనపర్తిని ఏరోజు పట్టించుకోలేదన్నారు. సభలు పేరుతో చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 2వేల మంది కూడా పట్టని చోట సభ పెట్టాలనుకున్నారంటూ వ్యాఖ్యానించారు.
చంద్రబాబుకు చట్టాలపై గౌరవం లేదు -మంత్రి చెల్లుబోయిన
చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కానీ, 40 ఏళ్ల అనుభవం, దాదాపు 15 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు చట్టాలను గౌరవించడం కూడా తెలియదంటూ మంత్రి మండిపడ్డారు. అనుభవం ఉంటే సరిపోదని, రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించకుండా గౌరవించకుండా టీడీపీ అధినేత చంద్రబాబు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మంత్రి చెల్లుబోయిన శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు వ్యవహరిస్తే ప్రభుత్వం, పోలీసులు మాత్రం చూస్తు ఊరుకోరని చెప్పారు. సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు సైకోలా ప్రవర్తిస్తున్నారని, ఆయనకు మతిస్థిమితం తప్పిందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీని ప్రజలు ఛీకొడుతున్నారని, పట్టించుకోవడం మానేశారని చెప్పారు. చంద్రబాబు తాను పాలకుడిగా కాకుండా రాజులా, నియంతలా వ్యవహరించి అమరావతి రైతుల నుంచి బలవంతంగా భూమిని సేకరించారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రచారయావతో ప్రాణాలు తీస్తున్నారు
మాజీ సీఎం చంద్రబాబు వల్లే రైతులు నష్టపోతున్నారని, ఏ ప్రాంతాన్ని కూడా ఆయన అభివృద్ధి చేయలేకపోయారని వ్యాఖ్యానించారు. ప్రచార యావ, ఆర్బాటంతో ఇటీవల 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్రం గురించి, అన్ని ప్రాంతాల ప్రజల అభివృద్ధిపై ఫోకస్ చేస్తున్న ఏపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. మూడు రాజధానులు చేసి పరిపాలన, అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల కోసం ఆలోచిస్తున్న వ్యక్తి సీఎం జగన్ అన్నారు. అనపర్తిలో సభ వద్దని, చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించవద్దని సూచించినా, ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు తన ఇష్టరీతిన వ్యవహరించి ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా చేస్తున్నారంటూ మండిపడ్డారు.