Anantapuram News: "పోలీసులతో రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా పనులు చేయించుకుంటోంది"
Anantapuram News: పోలీసులతో రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా పనులు చేయించుకుంటోందని అనంతపురం జిల్లా డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ ఆరోపించారు. ఈ క్రమంలోనే పట్టణంలో నిరాహార దీక్షకు దిగారు.
Anantapuram News: పోలీసులతో రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా పనులు చేయించుకుంటోందని అనంతపురం జిల్లాలో డిస్మస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఆరోపించారు. రెండేళ్లుగా పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఇలా చేయడం దారుణం అన్నారు. ఆదివారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో ఆయన అనంతపురం జడ్పీ కార్యాలయం సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరాహార దీక్షకు దిగారు. ఓ చేత సర్కారు చెల్లించాల్సి బకాయిలు వెంటనే చెల్లించాలని రాసి ఉన్న ప్లకార్డు చేత పట్టుకొని రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 70 వేల మంది పోలీసులకు సుమారు రెండేళ్లుగా 20 టీఏలు, 5 డీఏలు, 2 ఎస్ఎల్ఎస్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలిపారు. సకాలంలో బకాయిలు అందక సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలపై రెండేళ్లుగా పోరాడుతున్నా ముఖ్యమంత్రి, డీజీపీ, హోం మంత్రి స్పందించలేదని వాపోయారు. గతంలో తాను వీటిపై ప్రశ్నించినందుకే పోలీసు ఉన్నతాధికారులు తనను డిస్మిస్ చేసి కడుపు కొట్టారని తెలిపారు. బకాయిలు విడుదల అయ్యే వరకు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. కానీ ఆయన అలా మాట్లాడిన కాసేపటికే రెండో పట్టణ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
అసలేం జరిగిందంటే..?
మూడు నెలల క్రితం పోలీసు శాఖలో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లాలని అనంతపురంలో కానిస్టేబుల్ ప్రకాష్ ప్లకార్డులను ప్రదర్శించడంతో వార్తల్లోకి ఎక్కారు. ఆయనపై పోలీసు శాఖ అంతర్గతంగా విచారణ జరిపి.. ఓ కేసు విషయంలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను ట్రాప్ చేసి.. పెద్ద ఎత్తున నగదు, నగలు కాజేశారని రుజువు కావడంతో డిస్మిస్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ ఆ మహిళ మీడియా ముందుకు వచ్చి .. ప్రకాష్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి తనను పావుగా వాడుకున్నారని తాను ప్రకాష్‌పై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పడంతో కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఆ వెంటనే ప్రకాష్ పోలీసు ఉన్నత అధికారులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయకపోతే కోర్టుకు వెళ్తానని ప్రకటించడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ ప్రారంభమైనా ఆ పోలీసు ఉన్నతాధికారులు ఇంకా విధుల్లోనే ఉన్నారు. వారు విధుల్లో ఉండగా నిష్పాక్షికమైన విచారణ ఎలా సాధ్యమని కానిస్టేబుల్ ప్రకాష్ ప్రశ్నించారు.
ఆ తర్వాత అనంతపురం ఎస్పీ పక్కీరప్ప కాగినెల్లిని ఎస్సీ , ఎస్టీ చట్టం కింద అరెస్టు చేయాల్సిందేనని ప్రకాష్ డిమాండ్ చేశారు. దళితుడననే చిన్నచూపుతోనే .. తప్పుడు కేసులు, వాంగ్మూలాలతో తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ ప్రకాష్ అనంతపురం టు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా జిల్లా ఎస్పీతోపాటు ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతు, డీఎస్పిలు రమాకాంత్, మహబూబ్ బాషాపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. విచారణ అధికారిగా పలమనేరు డీఎస్పీ గంగయ్యను డీఐజీ రవిప్రకాష్ నియమించారు.