Rs 1.48L Electricity Bill: కూలీ కుటుంబానికి కరెంట్ బిల్లు షాక్.. మూడు బల్బులకు రూ.లక్షన్నర బిల్లు
అతనో కూలీ.. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అలాంటి నిరుపేద కుటుంబానికి పెద్ద షాక్ తగిలింది. పింఛన్ మీద ఆధారపడి బతికే కుటుంబానికి విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు.
పింఛన్ వస్తే తప్ప సంసారం సాగని పరిస్థితి వారిది. ఏదో కాలక్షేపానికి ఇంట్లో ఒక చిన్న టీవీ ఉంది. ఒక ఫ్యాన్, రెండు లైట్లు ఉన్నాయి. వీటికే గుండె గుబేల్ మనేట్టుగా కరెంటు బిల్లు పంపారు విద్యుత్ అధికారులు.
వేల బిల్లులు ఎలా కట్టాలి?
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పాల్తూరు గ్రామానికి చెందిన పర్వతప్ప కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అతని ఇంట్లో మూడు బల్బులు, ఫ్యాన్, టీవీ ఉన్నాయి. ప్రతి నెలా కరెంట్ బిల్లు రూ.200- 300 వచ్చేది. కానీ ఈసారి ఏకంగా రూ.1,48,371 కరెంట్ బిల్లు వచ్చింది. బిల్లు చూసి అవాక్కయ్యారు. ఈ బిల్లుపై పలుమార్లు విద్యుత్‌శాఖ సిబ్బంది చుట్టూ తిరిగారు పర్వతప్ప. విద్యుత్ అధికారులు రూ.56,399కి తగ్గించి కట్టాలని చెబుతున్నారన్నారు. కానీ తాము అంత బిల్లు చెల్లించలేమని పర్వతప్ప కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు.
Also Read: Sajjanar Encounter Enquiry : సజ్జనార్ బదిలీకి.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు సంబంధం ఉందా..!?
ఊరిలో మరికొందరికి సైతం
ఈ గ్రామంలోనే మరికొందరికి సైతం ఇదే విధంగా విద్యుత్ బిల్లులు వచ్చాయి. బండయ్య అనే వ్యక్తికి రూ.78,167, మరోకరికి రూ.16,251 కరెంట్ బిల్లులు వచ్చాయి. సాధారణ కూలి పని చేసుకుని, ప్రభుత్వం ఇచ్చే పింఛన్ ఆధారంగా జీవించే తమకు వేలల్లో కరెంట్ బిల్లు వేస్తే ఎవరికి చెప్పుకోవాలని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. ఊరిలో ఇంత మందికి అధిక కరెంట్ బిల్లులు వచ్చినా విద్యుత్ అధికారులు స్పందించడంలేదన్నారు.
అవకాశం ఉంటే తగ్గిస్తాం
విద్యుత్ మీటర్లలో ఏదైనా సమస్య ఉంటే సరిచేయాలని అధికారులను కోరుతున్నారు. ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాసులరెడ్డిని వివరణ కోరగా సాంకేతిక సమస్య లేదా సిబ్బంది బిల్లు తీయడంలో ఏదైనా పొరపాటు జరిగి ఉండవచ్చన్నారు. అవకాశం ఉంటే వారికి బిల్లు తగ్గించే ప్రయత్నం చేస్తామన్నారు.
Also Read: Afghanistan Taliban Crisis: అఫ్గాన్ పేలుళ్లలో 103కి చేరిన మృతులు.. 150 మందికి గాయాలు