(Source: ECI/ABP News/ABP Majha)
Payyavula Kesav: భారతీయ జగన్ పార్టీగా బీజేపీ, ఆ సభ కూడా అలాంటిదే.. పయ్యావుల సంచలన వ్యాఖ్యలు
ఏపీలో భారతీయ జగన్ పార్టీ కొనసాగుతోందని పయ్యావుల కేశవ్ విమర్శించారు. అనంతపురంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో బీజేపీ ప్రజాగ్రహ సభ ఓ బూటకం అని.. అది ఈ సంవత్సరానికి అతిపెద్ద జోక్ అని టీడీపీ సీనియర్ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కొట్టిపారేశారు. ఈ రోజు విజయవాడలో జరుగుతున్నది ప్రజాగ్రహ సభ కాదు.. జగన్ అనుగ్రహ సభ అంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వం ఆర్థిక అరాచకాలు కొనసాగిస్తున్నా రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం నోరెత్తడం లేదని ఆరోపించారు. దేశంలో బీజేపీ వేరు... రాష్ట్రంలో బీజేపీ వేరు అంటూ వ్యాఖ్యానించారు. దేశంలో పార్టీకి జనసేన మిత్రపక్షం అయితే ఇక్కడ జగన్ పార్టీ మిత్రపక్షం అని విమర్శించారు. ఏపీలో భారతీయ జగన్ పార్టీ కొనసాగుతోందని విమర్శించారు. అనంతపురంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పయ్యావుల కేశవ్ మాట్లాడారు.
బీజేపీకి బ్రాండ్‌గా ఉన్న హిందుత్వ అంశాలపైనా మౌనంగా ఉన్నారని.. ఆలయాలపై దాడులు జరిగినా ఆ పార్టీ నేతలు పట్టించుకోలేదని పయ్యావుల కేశవ్ ఆక్షేపించారు. ‘‘అమరావతి రైతులకు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ నేతలకు తెలియదా? కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చి చెబితేనే మేల్కొన్నారు. పోలీసులే సామాన్యుల రూపంలో వచ్చి దాడులు చేసే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రజల కోసం కాకుండా ప్రభుత్వం కోసం పని చేసే రకంగా తయారైంది. సీఎం జగన్ నెట్‌వర్క్‌లో ఏపీ బీజేపీ పని చేస్తోంది. కేంద్ర నిధులు దారి మళ్లిస్తుంటే ఇక్కడి బీజేపీ నేతలకు ఏమాత్రం పట్టట్లేదు. నిజంగా ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రా ప్రభుత్వ ఆర్థిక అరాచకాలపై పోరాడాలి’’ అని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.
‘‘జనాగ్రహ సభకు వచ్చే కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌కి కూడా ఒక్కటే చెబుతున్నా. ఇక్కడ భారతీయ జనతా పార్టీ లేదు.. భారతీయ జగన్ పార్టీ ఉంది. చైనాలో వచ్చిన కరోనాకు మందు కనుక్కున్నాం. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు మందు కనుక్కోలేదు. బీజేపీ బ్రాండ్ హిందుత్వపై దాడులు జరుగుతుంటే ఇక్కడ మౌనంగా ఉంటుంది. ధర్మకర్త అశోక్ గజపతిరాజుపై దాడి జరిగితే మౌనంగా ఉన్నారు. దేశం మొత్తంలో బీజేపీ మోదీ, షా ఆదేశాలతో పనిచేస్తుంటే ఇక్కడ జగన్ కనుసన్నుల్లో బీజేపీ పనిచేస్తోంది. ఓ ఎంపీని చంపే అంత పని చేశారు. ఓ బాబాయిని చంపితే ఇప్పటికి నిందితులు ఎవరో తెలియదు. ఓ డాక్టర్‌ని కొట్టి చంపితే అతీగతీ లేదు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అత్యాచారాలపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపించే దమ్ము ఉందా.?’’
‘‘ప్రజల కంటే ప్రభుత్వం కోసం ఇక్కడ పార్టీ పనిచేస్తోంది. కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్రం ముద్ర వెసుకుంటే.. పంచాయతీ నిధులు వాడుకుంటే ఇక్కడి బీజేపీకి సమ్మతమే. రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం కోసం పనిచేస్తోంది. రాష్ట్ర బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు జనాగ్రహ సభలో ప్రభుత్వంపై వైఖరి ప్రకటించాలి. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండను అని చెప్పి.. యుద్ధం చేయకనే విరామం ప్రకటించిన వ్యక్తిని ముందు పెట్టుకొని యుద్ధం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన టీడీపీ పోరాడుతోంది. రాబోవు రోజుల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తుంది.’’ అని పయ్యావుల కేశవ్ మాట్లాడారు.
Also Read: Movie Ticket Rates Issue: టికెట్ రేట్స్ ఇష్యూ... ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీలో సభ్యులు వీరే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి