(Source: ECI/ABP News/ABP Majha)
Anantapur: వైసీపీలో టికెట్ల టెన్షన్, అనంతపురంలో జగన్ ఎవరికి ఝలక్ ఇస్తారో! టెన్షన్‌లో ఎమ్మెల్యేలు
YSRCP News: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిట్టింగ్ లను మార్చడం ద్వారా సొంత పార్టీ నాయకులు కార్యకర్తలలో ఉన్న వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.
Anantapur Politics: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించి బోల్తాపడడంతో ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ప్రజా వ్యతిరేకత ఉన్న నేతలను స్థానాలను మార్చాలని ప్రక్షాళన మొదలుపెట్టింది. ఇప్పటికే పార్టీలోని 50 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు లేవని చెప్పకనే చెప్పింది. మరో 35 మందికి ప్రస్తుతం ఉన్న స్థానంలో కాకుండా మరోచోట నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిట్టింగ్ లను మార్చడం ద్వారా సొంత పార్టీ నాయకులు కార్యకర్తలలో ఉన్న వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆరుగురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ అవకాశాలు కనిపించడం లేదు. ఈ ఆరుగురికి టికెట్లు ఇస్తారా లేదంటే మరో స్థానం నుంచి పోటీ చేయిస్తారా అన్న చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎంత మేరా ఖర్చు పెట్టుకోగలరు అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సిట్టింగులకు విజయ అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఐ పాక్ ఇచ్చిన సర్వే ఆధారంగా కొందరిని మార్చేయవచనంలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రాంరెడ్డి కుటుంబంలో ఐదుగురికి పదవులు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో గుంతకల్ టికెట్ వేరే సామాజిక వర్గానికి ఇవ్వాలన్న ఆలోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి మాత్రం తన కూతురు నైరుతి రెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం ముందు తన ప్రతిపాదన ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డికి టికెట్ వచ్చే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి.
రాయదుర్గంలో వర్గపోరు..
ఎమ్మెల్యే కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కొత్త వ్యక్తిని బరిలోకి దింపాలని ఆలోచన అధిష్టానం చేస్తుంది. రాయదుర్గంలో వాల్మీకి బోయలు అధిక సంఖ్యలో ఉండడంతో అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను రాయదుర్గం నుంచి పోటీ చేయిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.
మాజీ మంత్రి పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు ఈసారి టికెట్ లభించే అవకాశం కనిపించటం లేదు. పెనుగొండలో వైసిపి లోని అంతర్గత పోరుతో రెండు వర్గాలుగా చీలిపోయాయి. ఈసారి శంకర్ నారాయణ కు టికెట్ కేటాయిస్తే మరో వర్గం పార్టీకి పని చేయమని బహిరంగంగానే చెప్పుకొచ్చారు. కదిరి నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉండడంతో ఈసారి ముస్లింలకు టికెట్ కేటాయించాలని వైసీపీ అధిష్టానం చూస్తోంది. ప్రస్తుత కదిరి ఎమ్మెల్యే సిద్దరెడ్డి పై కొంత వ్యతిరేకత ఉంది.
ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమేని జోరుగా ప్రసారం జరుగుతుంది. సింగనమల నుంచి ఈసారి కొత్తవారికి టికెట్ కేటాయించాలని అధిష్టానం భావిస్తుంది. చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ఓ డిఎస్పీకి సింగనమల టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతుంది. మడకసిర ఎమ్మెల్యే తిప్పే స్వామికి సొంత పార్టీ నేతలే ఈసారి టికెట్ ఇవ్వకూడదని పార్టీ నాయకులకు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో వ్యక్తికి టికెట్ కేటాయించాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీకి చెందిన కొందరు చెబుతున్నారు.
జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు దృష్ట్యా వీరందరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తారా లేక మరో చోటు నుంచి పోటీ చేయిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గెలిచేవారికి టికెట్లు అంటూ పార్టీలో ప్రక్షాళన మొదలు పెట్టడంతో ఎమ్మెల్యేలకు తమ స్థానం పదిలంగా ఉంటుందో లేదో అన్న బెంగ చుట్టుకుంది.