Anantapur Politics: ఎన్నికల్లో జగన్ వ్యూహం ఏంటి? కన్ఫ్యూజన్‌లో అనంతపురం వైసీపీ నేతలు
YSRCP News: తను ఒకటి తలిస్తే.. పార్టీ అధినేత మరొకటి తలిచాడు అన్నట్లుగా ఉంది ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నేతలు పరిస్థితి.
![Anantapur Politics: ఎన్నికల్లో జగన్ వ్యూహం ఏంటి? కన్ఫ్యూజన్‌లో అనంతపురం వైసీపీ నేతలు Anantapur Loksabha Polls 2023 YSRCP leaders confused over Jagan decisions DNN Anantapur Politics: ఎన్నికల్లో జగన్ వ్యూహం ఏంటి? కన్ఫ్యూజన్‌లో అనంతపురం వైసీపీ నేతలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/09/e462ce8ab24f07c048442f2f26cf3c621704801822876233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP CM YS Jagan Mohan Reddy: అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు ఎవరికీ అంతు చిక్కక తలలు పట్టుకుంటున్నారు. తను ఒకటి తలిస్తే.. పార్టీ అధినేత మరొకటి తలిచాడు అన్నట్లుగా ఉంది ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నేతలు పరిస్థితి. తమ ఊహకు అందని విధంగా పార్టీ అధినేత జగన్ (YS Jagan) నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారని జిల్లాలో హాట్ టాపిక్ అయింది.
ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం, హిందూపురం పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. సామాజిక సమీకరణాల కోణంలో ఈసారి పాతవారికి కాకుండా కొత్తవారికి జగన్ అవకాశం కల్పించారు. 2019 ఎన్నికల్లో ఈ రెండు పార్లమెంటు స్థానాలకు వైఎస్సార్ సీపీ తరఫున ఇద్దరు ప్రభుత్వ అధికారులకు పార్టీ అధినేత జగన్ అవకాశం కల్పించారు. అనంతపురం పార్లమెంటు నుంచి పీడీగా పనిచేస్తున్న తలారి రంగయ్యను అవకాశం కల్పించారు. హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా పోలీసు అధికారైన గోరంట్ల మాధవ్ కు అవకాశం కల్పించారు. సామాజికపరంగా చూసుకుంటే తలారి రంగయ్య వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నేత.. గోరంట్ల మాధవ్ కురుబ సామాజిక వర్గానికి చెందిన నేత. జిల్లాలో ఆయా సామాజిక వర్గాల సమీకరణాల ఆధారంగానే పోయిన ఎన్నికల్లో వీరికి అవకాశం కల్పించారు. కానీ అదంతా గతం, ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లా పార్లమెంటు స్థానాలకు కొత్త వారికి జగన్ అవకాశం కల్పించారు.
అనంతపురం పార్లమెంటు సమన్వయకర్తగా పెనుగొండ ఎమ్మెల్యే సత్యసాయి జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు శంకర్ నారాయణను నియమించారు. శంకర్ నారాయణ కురుబ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇదే విషయం ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అనంతపురం పార్లమెంటు వ్యాప్తంగా రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గలలో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. గుంతకల్లు, సింగనమల, అనంతపురం నియోజకవర్గాలలో ఓ మోస్తరుగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉంటారు. వాల్మీకీలు అధికంగా ఉన్న అనంతపురం పార్లమెంటుకు కురుబ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నారాయణ పార్లమెంటు అభ్యర్థిగా నియమించడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ అధినేతకు తాము చెప్పింది ఒకటైతే, సీఎం జగన్ చేస్తుంది మరొకటి అంటూ ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నేతలు అంటున్నారు.
హిందూపురంలో కురుబ ఓటర్లు అధికం
హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో అధికంగా కురుబ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉంటారు. అయితే హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా బోయ సామాజిక వర్గానికి చెందిన కర్ణాటక బీజేపీ మాజీ ఎంపీ శాంతమ్మను నియమించారు. ఈమె పార్టీలో చేరిన రోజునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందూపురం పార్లమెంటు సమన్వయకర్తగా ఈమె పేరును ప్రకటించారు. ఈమె బోయ సామాజిక వర్గానికి చెందిన నేత. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో పెనుగొండ, హిందూపురం, కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాలలో కురుబ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. మిగిలిన నియోజకవర్గాలలో వీరి ప్రభావం కూడా కనిపిస్తుంది. అయితే కురుబలు ఎక్కువగా ఉన్నచోట బోయ సామాజిక వర్గానికి చెందిన శాంతమ్మకు అవకాశం కల్పించడం.. బోయ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్న అనంతపురం స్థానానికి కురుబ సామాజిక వర్గానికి చెందిన పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు ఛాన్స్ ఇచ్చారు.
ఇలాంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడం వెనుక పార్టీ అధినేత జగన్ వ్యూహం ఏంటో తెలియక ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రమంతా సర్వేలు చేయిస్తూ సామాజిక సమీకరణాల్లో భాగంగానే నియోజకవర్గాలలో పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థులను ఖరారు చేస్తున్న జగన్.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాత్రం రివర్స్ గా సమన్వయకర్తల్ని నియమించటంపై జిల్లా నేతలు చర్చించుకుంటున్నారు. ఈ నిర్ణయాలకు కారణం ఏంటి, ఇంతకీ ఈ వినూత్న నిర్ణయాలు ఉమ్మడి అనంతపురం జిల్లా రాజీయాల్లో ఎటు దారి తీస్తాయోనని నేతల్లో ఆందోళన మొదలైంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)