R Krishnaiah Thanks YS Jagan: ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు, కానీ వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చారు : ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు
సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధి ఆర్.కృష్ణయ్య కలిశారు. తనను రాజ్యసభ అభ్యర్ధిగా ఎంపిక చేసినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
రాజ్యసభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా వి.విజయసాయిరెడ్డి, ఆర్.కృష్ణయ్య, ఎస్.నిరంజన్‌రెడ్డి, బీదా మస్తాన్‌రావులను ఎంపిక చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డిలు ప్రకటించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధి ఆర్.కృష్ణయ్య కలిశారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు.
దాదాపుగా 47 సంవత్సరాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల గురించి, వారి విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి గురించి ఆ కులాలకు పట్టి పీడిస్తున్న అమాయకత్వం గురించి, విముక్తి గురించి అనేక పోరాటాలు చేశానన్నారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలు చేసినా తనను ఏ రాజకీయ పార్టీ గుర్తించలేకపోయిందన్నారు. ఒకవేళ గుర్తించినా అవకాశం ఇవ్వడానికి భయపడ్డారని, కానీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్... తన సేవ, నిబద్ధత, అంకితభావాన్ని గుర్తించి ఈ వర్గాలకు మరింత సేవ చేసేలా ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ఆర్.కృష్ణయ్య.
కేబినెట్‌లో బీసీలకు సముచిత స్థానం..
ఏపీలో మొన్నటి మంత్రివర్గ విస్తరణలో కూడా బీసీలకు సముచిత స్థానం కల్పిస్తూ పదిమందికి అవకాశం కల్పించిన నేత వైఎస్ జగన్ అన్నారు. అందరికీ కలిపి (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు) 15మందికి తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. 25మంది మంత్రివర్గంలో 15మందికి స్థానం కల్పించడం చరిత్రలోనే మొట్టమొదటిసారిగా చెప్పుకోవాలన్నారు. ఉమ్మడి ఏపీలో 45, 50మంది మంత్రులు ఉంటే కూడా బీసీలకు కనీసం 10 స్థానాలు కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. కానీ విభజన తర్వాత, చిన్న రాష్ట్రం ఏపీలో సీఎం జగన్ 10 బీసీ నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు.
రాజ్యసభలో బీసీ బిల్లు
స్వాతంత్ర్యం వచ్చి 74ఏళ్లు అయినా ,భారతదేశ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎవరూ అడగలేదు. కానీ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా రాజ్యసభలో బీసీ బిల్లు ప్రవేశపెట్టించడమే కాకుండా, చట్టసభలో 50శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని, కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని, బీసీలకు అన్నిరంగాల్లో రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని పార్లమెంట్‌లో పోరాడిన ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ. ఆనాడే దేశ ప్రజలంతా నివ్వెరపోయారని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు.
Also Read: ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలు - వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీళ్లే
పలు రాష్ట్రాల్లో బీసీల నాయకత్వంలో ఉన్న రాజకీయ పార్టీలు, బీసీ ముఖ్యమంత్రులు ఉన్నా కూడా పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టే సాహసం, ధైర్యం చేయలేకపోయారు. అయితే సీఎం జగన్ ఆదేశాలతో రాజ్యసభలో బీసీ బిల్లు పెట్టి చరిత్ర సృష్టించారు. అన్ని సామాజిక కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వాటికి, బడ్జెట్‌లో నిధులు కేటాయించి, పాలకమండళ్లు ఏర్పాటు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్నిరంగాలలో 44శాతం వాటా కల్పించి ఈ వర్గాల నాయకత్వంతో పాటు, అధికారంలో వాటా, సాధికారత కల్పించి ఈ కులాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ పాటుపడ్డారు. నాకు కల్పించిన అవకాశాన్ని సీఎం జగన్ ఆశయాలకు తగ్గట్టుగా పేదవర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. తన మీద ఉంచిన విశ్వాసాన్ని నిలుపుకుంటానని పేర్కొన్నారు.
‘ఒక్క తెలంగాణలోనే నేను పోరాడలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న బీసీల అభివృద్ధి కోసం నేను పని చేస్తున్నా. చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలంటే అది ఒక్క తెలంగాణకే కాదు, దేశంలో అందరి కోసం రిజర్వేషన్లు.అలానే కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని కొట్లాడుతున్నాను. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని పోరాడుతున్నది కూడా దేశంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల కోసమే. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఈ వర్గాలు అభివృద్ధి చెందాలని జాతీయ స్థాయిలో పోరాడుతున్నాను. దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. నిలువెత్తు నిజాలతో, నిలువెత్తు అంకితభావంతో బీసీల అభివృద్ధి కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుందని’ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు.
,Also Read: Lucky Krishnayya : ఏ పార్టీ అయినా పిలిచి మరీ అవకాశాలు - అదృష్టమంటే ఆర్.కృష్ణయ్యదే !