Lucky Krishnayya : ఏ పార్టీ అయినా పిలిచి మరీ అవకాశాలు - అదృష్టమంటే ఆర్.కృష్ణయ్యదే !
రాజకీయాల్లో అదృష్టవంతుడు ఆర్.కృష్ణయ్య. రాజకీయ పార్టీలు పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నాయి.
రాజకీయాల్లో ఉండాల్సింది అదృష్టమే. అదే ఉంటే పదవులు అలా పరుగులు పెట్టుకుంటూ వస్తాయని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య నిరూపిస్తున్నారు. నిజానికి ఆయన రాజకీయాల్లోకి సీరియస్‌గా రాలేదు. రాజకీయ పార్టీలే లాక్కొచ్చాయి. బీసీ సంక్షేమ సంఘం నేతగా ఆయన ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న.. ఆయా ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు నెరపుతూ ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన బీసీ ఉద్యమాలను నిర్వహించారు.
ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలు - వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీళ్లే
రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఎన్నికలకు వెళ్లాలనుకున్నారు. తటస్థ నేత అయితే ప్రజలు నమ్ముతారని అనుకున్నారేమో కానీ ఆయనకు బీసీ సంక్షేమ సంఘం పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న కృష్ణయ్యే కనిపించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామనేసరికి ఆయన మరుమాట్లాడకుండా అంగీకరించి పసుపు కండువా కప్పుకున్నారు. చంద్రబాబు కూడా సీఎం అభ్యర్థి గెలవకపోతే ఎట్లా అని.. ఎల్బీ నగర్ నుంచి పార్టీ సీనియర్లు ఉన్నప్పటికీ కాదని వారందరికీ నచ్చ చెప్పి నిలబెట్టి గెలిపించారు.
కానీ టీడీపీ గెలవకపోవడంతో ఆర్.కృష్ణయ్య ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ముందస్తు ఎన్నికల నాటికి టీడీపీ టిక్కెట్ నిరాకరించింది. దాంతో ఆయన చాలా పార్టీల నేతలను కలిశారు. చివరికి కాంగ్రెస్ నేత జానారెడ్డి ఆయనకు మిర్యాలగూడ టిక్కెట్‌ను ఇప్పించి తీసుకెళ్లి పోటీ చేయించారు. కాంగ్రెస్‌లో చేరకుండానే టిక్కెట్ పొందిన ఆయన.. కాంగ్రెస్ కండువా కప్పుకుని పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన పార్టీలో ఉండటం ఆయనకు ఇష్టం ఉండదు. అందుకే వెంటనే ప్లేటు ఫిరాయించారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్‌కు మద్దతుగా ప్రకటనలు చేశారు.
ఏపీలో ప్రతీ ఇంటా వెంకాయమ్మ మాటే వినిపిస్తోంది : సీఎం జగన్‌కు నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్
గత ఎన్నికల్లో ఆయన ఏపీలో వైఎస్ఆర్‌సీపీ తరపున మద్దతుగా మాట్లాడారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో ఏపీకి వచ్చి ప్రభుత్వానికి మద్దతుగా ప్రకటనలు చేశారు. ఇటీవల ఆయన తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ సన్నాహాల్లో ఉండగానే ఆయనను వెదుక్కుంటూ ఏపీ నుంచి మరో అవకాశం వచ్చింది. ఉదయం వరకూ ఏపీ రాజ్యససభ్యులుగా ఆయనకు అవకాశం ఇస్తారని ఎవరూ అనుకోలేదు. అనూహ్యంగా పిలుపు వచ్చింది. ఆయన కోసం తెర వెనుక ఎవరైనా లాబీయింగ్ చేశారో లేదో తెలియదు కానీ అదృష్టం మాత్రం ఆయన వైపు ఉందని తేలిపోయింది.