YSRCP Plenary: గజదొంగలంతా ఏకమైనా మనల్ని అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరు: వైఎస్ జగన్ ధ్వజం
CM Jagan Speech: గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.
మన నిజాయతీకి, గజదొంగల ముఠాకు దోపిడీ తనానికి పోటీనా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎల్లో మీడియా పని గట్టుకొని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తోందని, వారికి తోడు దత్త పుత్రుడు (పవన్ కల్యాణ్) కలిశాడని ఎద్దేవా చేశారు. వీరంతా కలిసి తమపై ముప్పేట దాడి చేస్తున్నారని మండిపడ్డారని అన్నారు. చంద్రబాబుకు ఉన్నట్లుగా మీడియా పత్రికలు తనకు అండగా నిలబడకపోవచ్చని, కానీ జనం ప్రేమాభిమానాలు అండగా ఉన్నాయని చెప్పారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి ప్రాంగణానికి చేరుకున్న జగన్, తొలుత పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రారంభ ఉపన్యాసం చేశారు.
అందరికీ సెల్యూట్
13 ఏళ్ల క్రితం సంఘర్షణ ప్రారంభమైందని అన్నారు. పావురాల గుట్టలో సెప్టెంబరు 25న జరిగిన ఘటనతో ఇదంతా మొదలైందని అన్నారు. 13 ఏళ్లుగా తనకు అండగా ఉన్న ప్రజలు, కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరికీ సీఎం ధన్యవాదాలు తెలిపారు. వారందరి సెల్యూట్ అని చెప్పారు.
YS Jagan Speech in Plenary: ఆ పార్టీని 25 సీట్లకి పరిమితం చేశారు - జగన్
గత ఎన్నికల్లో ప్రజల అండదండలతో ఏకంగా 151 స్థానాలు సాధించగలిగామని వైఎస్ జగన్ అన్నారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొన్న టీడీపీని 23 సీట్లకి, 3 ఎంపీ స్థానాలకి పరిమితం చేశారని గుర్తు చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా తనను ఆదరించారని అన్నారు. గత ముడేళ్లలో 95 శాతం హామీలను అమలు చేశామని చెప్పారు. తమ మేనిఫెస్టోను బైబిల్ గా, ఖురాన్, భగవద్గీతగా పరిగణిస్తున్నామని చెప్పారు. టీడీపీ నేతలు తమ మేనిఫెస్టోను జనానికి దొరక్కుండా, వెబ్ సైట్‌లో, యూట్యూబ్ లో నుంచి తొలగించారని జగన్ విమర్శించారు.
‘‘రైతులపై మమకారం అంటే ఇలా ఉంటుందని మనమే చేసి చూపించాం. పరిపాలనలో సంస్కరణలు ఇలా ఉంటాయని మనమే చేశాం. పిల్లల భవిష్యత్తును చక్కగా తీర్చి దిద్దుతున్నాం. వైద్యం, ఆరోగ్యంపై శ్రద్ధ అంటే ఇదీ అని మనం నిరూపించాం. అవినీతి, లంచం, వివక్షకు తావు లేకుండా చూపించాం. నవరత్నాలను కచ్చితంగా అమలు చేస్తున్నాం. అసలు ప్రతిపక్షానికి నైతిక విలువలు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నా.’’ అని జగన్ అన్నారు.
ఎన్ని జెలుసిల్ మాత్రలు ఇచ్చినా కడుపుమంట తగ్గదు
‘‘మనం జనం ఇంట్లో, వారి గుండెల్లో ఉన్నాం. ఎల్లో పార్టీ మాత్రం ఎల్లో టీవీల్లో, ఎల్లో పేపర్లు, ఎల్లో సోషల్ మీడియాలో మాత్రమే గజదొంగల ముఠా ఉంది. వారికి మనకీ పోలిక ఎక్కడుంది. మన చేతల పాలనకు వారి చేతగాని పాలనకు పోటీనా?’’ అని జగన్ మాట్లాడారు. రేపు (జూన్ 9) ప్లీనరీ ముగింపు సందర్భంగా మరోసారి తాను మాట్లాడతానని సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.